చిరుత కాదు.. అడవి పిల్లి

1 Aug, 2019 08:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కూకట్‌పల్లి ప్రగతినగర్‌లో చిరుత సంచరిస్తుందనే వార్తలు కలకలం రేపాయి. అయితే రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు అవన్నీ పుకార్లేనని తేల్చారు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం సాయంత్రం గాజులరామారం, ప్రగతినగర్‌ సరిహద్దులో ఉన్న మిథిలానగర్‌లో చిరుతపులి కనిపించిందని వాకర్స్‌ ఫోటోలు, వీడియో తీసి వైరల్‌ చేశారు. దాంతో స్థానికులు ఆందోళనకు చెందారు. అటవీ ప్రాంతం విస్తరించి ఉన్న ప్రగతినగర్, మిథిలానగర్, కైసర్‌నగర్, దేవేందర్‌ నగర్, లాల్‌సాబ్‌గూడ, బాలయ్యనగర్‌ ప్రాంత వాసులు బుధవారం ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడ్డారు. దీంతో బుధవారం ఉదయం చేరుకున్న దూలపల్లి ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి మిథిలానగర్‌కు చేరుకుని స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆ ప్రాంతాన్ని సిబ్బందితో జల్లెడ పట్టారు. అక్కడ లభించిన రెండు వెంట్రుకలు, ఫొటోలు, వీడియోల ఆధారంగా వచ్చింది ‘అడవి పిల్లి’గా తేల్చారు. 

గీతాంజలి స్కూల్‌లో చిరుత దూరిందని..
ఈ ప్రాంతంలో చిరుత సంచారం లేదని అధికారులు ధ్రువీకరించిన కూడా ఈ వార్తలకు తెరపడలేదు. మిథిలానగర్‌లోని గీతాంజలి స్కూల్‌లో చిరుత దూరిందని బుధవారం సాయంత్రం ప్రచారం జరిగింది. ఈ వార్తలతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో మరోసారి రంగంలోకి దిగిన అధికారులు అవన్నీ పుకార్లేనని తేల్చారు. స్కూల్‌ వాచ్‌మెన్‌, డ్రైవర్‌లు చిరుత అరుస్తున్నట్టు శబ్దాలు క్రియేట్‌ చేశారని ఆరోపణలు రావడంతో పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. చిరుత పేరుతో వదంతులు సృష్టిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

>
మరిన్ని వార్తలు