భారత్‌లో ప్రాణాంతకంగా నకిలీ వార్తలు: బీబీసీ

25 Jun, 2018 04:37 IST|Sakshi

లండన్‌: ఫేస్‌బుక్, వాట్సాప్‌ ద్వారా చక్కర్లు కొడుతున్న నకిలీ వార్తలు భారత్‌లో పెనుముప్పుగా తయారయ్యాయని బ్రిటీష్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ కార్పొరేషన్‌ (బీబీసీ) తెలిపింది. తద్వారా దేశంలో పలువురు అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని బెంగళూరులో ఇటీవల విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. పిల్లల్ని ఎత్తుకెళ్లేందుకు కిడ్నాపర్లు నగరంలోకి వచ్చారన్న వదంతుల నేపథ్యంలో బెంగళూరులో గత మంగళవారం కాలురామ్‌ బచ్చన్‌రామ్‌ అనే వ్యక్తిని కొట్టిచంపిన ఘటనపై ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ విషయమై బీబీసీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ..‘భారత్‌లో విచ్చలవిడిగా వ్యాపిస్తున్న వదంతులకు కాలూరామ్‌ బలైపోయాడు. ఇలాంటి నకిలీ వార్తలు, వదంతులకు ఇప్పటివరకూ దేశంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు’అని చెప్పారు. ఈ నకిలీ వార్తలు, వదంతులకు చెక్‌ పెట్టేందుకు ‘బీబీసీ రియాలిటీ చెక్‌’ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. 2016లో బ్రెగ్జిట్‌ సందర్భంగా ఈ సేవల్ని ఆవిష్కరించామన్నారు. భారత్‌లో దాదాపు 83 శాతం మంది ప్రజలు నకిలీ వార్తల వ్యాప్తిపై ఆందోళన చెందుతున్నట్లు ఇటీవల చేపట్టిన ఓ అధ్యయనంలో తేలిందన్నారు. 

మరిన్ని వార్తలు