నకిలీ విత్తు!

6 Jun, 2018 12:52 IST|Sakshi
జిల్లా కేంద్రంలోని ఫర్టిలైజర్‌ దుకాణంలో తనిఖీ చేస్తున్న టాస్క్‌ఫోర్స్‌ అధికారులు (ఫైల్‌), అయిజ మండలం తూంకుంటలో టాస్క్‌ఫోర్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్న అనుమతి లేని పత్తి విత్తనాలు

సాక్షి, గద్వాల : జిల్లావ్యాప్తంగా ఇటీవల టాస్క్‌ఫోర్స్‌ అధికారులు జరుపుతున్న దాడుల్లో నకిలీ విత్తనాల బాగోతం బయట పడుతోంది. ఈ నెల రోజులోనే రూ.కోట్లు విలువజేసేవి పట్టుకున్నారు. రైతు తమ పొలంలో దుక్కి దున్ని విత్తనాలు వేసినప్పటి నుంచి ధాన్యం అమ్ముకునేంత వరకు అన్ని రకాలుగా దోపిడీకి గురవుతున్నాడు. నకిలీ విత్తనాలు, ఎరువులు, ఫెస్టిసైడ్స్‌ ముప్పెట దాడి చేస్తున్నాయి. నకిలీ దందా నిర్వహించే వారు కోట్లకు పడుగలెత్తుతుంటే, ఆరుగాలం కష్టపడి పండించిన పంట నకిలీ విత్తనాలు,

ఎరువుల వల్ల సక్రమంగా దిగుబడి రాక, వచ్చిన ధాన్యానికి గిట్టుబాటు ధర లభించక రైతులు మ రింత అప్పుల్లో కూరుకుపోతున్నారు. నడిగడ్డ కేం ద్రాంగానే ఎక్కువగా నకిలీ విత్తనాల దందా కొనసాగుతోంది. వీరిపై కఠిన చర్యలు తీసుకుం టామని, కొత్తగా ఆర్డినెన్స్‌ తీసుకొస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా అది మాటలకే పరిమితం కావడంతో అడ్డూఅదుపు లేకుండాపోయింది. అనుమతి లేకపోయినా కొందరు దళారులు బీటీ–3 విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. 

మభ్యపెడుతున్న వ్యాపారులు 
రాష్ట్రంలోనే అత్యధికంగా సీడ్‌ పత్తి సాగు ఈ జిల్లాలోనే ఉంటోంది. దీనిని ఆసరా చేసుకుని విత్తన కంపెనీలు ఆర్గనైజర్ల సహకారంతో గతేడాది రైతులతో బీటీ–3 విత్తనాలు సాగు చేయించినట్టు బహిర్గతమైంది. నకిలీ పత్తి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ఎంత హె చ్చరించినా చాపకింద నీరులా వాటి విక్రయం కొ నసాగుతూనే ఉంది. డీలర్‌ కంటే తక్కువ రేటుకు విక్రయిస్తామంటూ రైతులను కొందరు వ్యాపారులు ఆకట్టుకుంటూ వీటిని అంటగడుతున్నారు. రైతులకు ఎలాంటి అనుమానాలు రాకుండా ఎక్కువ ప్యాకెట్లను కొంటే రేటు తక్కువగా ఇస్తామని చెబుతున్నారు. ప్రముఖ బ్రాండ్‌ల నకళ్లను రూపొందించి గ్రామాల్లో తిరుగుతూ వాటినే అసలివిగా చూపెడుతూ విక్రయిస్తున్నారు.

అలాగే డీలర్లను సైతం కమీషన్‌ ఎక్కువగా ఇస్తామంటూ తమ వైపు తిప్పుకొంటున్నారు. ఇంటింటికీ తిరుగుతూ మరీ రైతులకు విత్తనాలను విక్రయిస్తున్న పరిస్థితి. జిల్లాలోని గద్వాల, అయిజ మండలాల్లో నకిలీ విత్తనాల విక్రయాలు ఎక్కువగా సాగుతున్నాయి. ఇక్కడ పండించిన విత్తనాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కర్నూలు పట్టణంలో నిల్వ ఉంచుతూ ఏటా అక్కడి నుంచి నకిలీ విత్తనాల మాఫీయా నడిగడ్డ కేంద్రంగా నకిలీ విత్తనాల వ్యాపారం చేస్తూ రైతులను నట్టేట ముంచుతూ రూ.కోట్లు గడిస్తున్నారు. అయితే సీడ్‌ పత్తి పై అధికార యంత్రాంగం ఈసారి ప్రత్యేక దృష్టి సారించడంతో ఇప్పుడైనా నకిలీ విత్తనాల నుంచి రైతులు బయటపడతారా లేదా అనేది చూడాలి.

వరుస దాడులు
పోలీసు, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్‌ అధికారులు నిర్వహిస్తున్న వరుస దాడుల్లో నకిలీ విత్తనాలు  పెద్ద ఎ త్తున బయటపడుతున్నాయి. గుట్టుచప్పుడు కా కుండా జర్మినేషన్‌లో ఫెయిల్‌ అయిన విత్తనాలకు రంగులు, రసాయానాలు అద్ది రైతులకు అమ్మి కొందరు వ్యక్తులు అక్రమంగా సంపాదిస్తున్నారు. ఇంతవరకు బీటీ–1, 2 రకం పత్తి విత్తనాలకు మాత్రమే ప్రభుత్వ అనుమతి ఉంది. అయితే కొ న్నేళ్లుగా కంపెనీలు రైతులతో గుట్టుచప్పుడు కా కుండా బీటీ–3 సాగు చేయిస్తున్నారని అధికారులు దాడులు జరిపి, పరీక్షించిన వాటిలో తేలింది. గతేడాది పెద్ద ఎత్తున వివిధ కంపెనీలు రైతుల ద్వారా ఫౌండేషన్‌ సీడ్‌గా బీటీ–3ని ఇచ్చి సాగు చేశారు.

ఇక్కడ పండించిన ఈ విత్తనాలను ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో నిల్వ ఉంచడంతో అక్కడి ప్రభుత్వం సదరు కంపెనీలపై క్రిమినల్‌ కేసులు పెట్టేం దుకు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అధి కారులు నకిలీ పత్తి విత్తనాలు, బీటీ–3ని నివారించేందుకు టాస్క్‌ఫోర్స్‌ బృందం ఈ సీజన్‌ ఆరంభంలోనే విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. అన్ని మండలాల్లో విస్తృతంగా దాడులు నిర్వహిం చి పొలాలు, ఇళ్ల వద్ద ఉన్న నకిలీ విత్తనాలను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకుంటున్నారు. ఇది తెలుసుకున్న కొందరు వ్యక్తులు తప్పని పరిస్థితుల్లో వాటిని రోడ్లపైన పారబోస్తున్నారు. తాజాగా సోమవారం జిల్లా కేంద్రంలోని పలు ఫర్టిలైజర్‌ దుకాణాల్లోనూ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అలాగే అయిజ మండలంలోని తూంకుంటలోని ఓ ఇంట్లో అనుమతి లేని పత్తి విత్తనాలు మూడు బస్తాలను స్వాధీనం చేసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

మచ్చుకు కొన్ని ఘటనలు

  •    
     గత ఏప్రిల్‌ 10న ధరూరు మండలం మార్లబీడులోని రాము ఇంట్లో సుమారు 3.25క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను అధికారులు పట్టుకున్నారు.

  •      16న ధరూరు మండలం సోంపురంలోని గోవిందు నుంచి 4.5క్వింటాళ్ల పత్తి విత్తనాల స్వాధీనం.

  •      మే 7న ధరూరు మండలం మార్లబీడు, సోంపురంలలో 3.36క్వింటాళ్లు, గట్టు మండలం మిట్టదొడ్డిలో 150క్వింటాళ్ల విత్తనాలు పట్టుబడ్డాయి.

  •      24న ధరూరు మండలం జాంపుల్లిలో రూ.12లక్షలు విలువ చేసే 12క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం.

  •      25న మల్దకల్‌ మండలం తాటికుంటలో రూ.12లక్షలు విలువ జేసే 28.50క్వింటాళ్ల స్వాధీనం. 

  •      28న గద్వాల పట్టణ పాత హౌసింగ్‌బోర్డుకాలనీలోని సీడ్‌ ఆర్గనైజర్‌ వెంకట్‌రెడ్డి ఇంట్లో 125కిలో నకిలీ పత్తి విత్తనాలు, అందుకు సంబంధించి రంగులు స్వాధీనం చేసుకున్నారు. 

  •      28న అయిజ మండలం మేడికొండలోని నాగరాజు ఇంట్లో 10.50క్వింటాళ్లు పట్టుబడ్డాయి. ధరూరు మండలం ర్యాలంపాడు రిజర్వాయర్‌ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు క్వింటాల్‌ నకిలీ పత్తినాలు పడేశారు. వాటిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

  •      30న అయిజ మండలం బింగిదొడ్డిలోని సబ్‌ ఆర్గనైజర్‌ తిమ్మప్ప ఇంట్లో 19.50క్వింటాళ్ల స్వాధీనం.
  •      జూన్‌ 1న మల్దకల్‌ మండలం అమరవాయిలోని డీలర్, సీడ్‌ ఆర్గనైజర్‌ తిమ్మారెడ్డి ఇంట్లో క్వింటాల్‌ నకిలీ పత్తి విత్తనాలు దొరికాయి.  
మరిన్ని వార్తలు