నకిలీ వీసాలతో మోసాలు

8 Nov, 2019 03:31 IST|Sakshi

షార్జా బల్దియా వీసాల పేరిట దగా

300 మంది బాధితులు..రూ.5 కోట్లకు టోకరా

నకిలీ వీసాలు ఇచ్చిన రాజస్తానీ యువకుడు

సిరిసిల్ల: గల్ఫ్‌ బాటలో ఘరానా మోసం జరిగింది. నకిలీ వీసాలు అంటగట్టి కోట్లు కొల్లగొట్టిన ఘటన తెలంగాణ జిల్లాల్లో వణుకు పుట్టిస్తోంది. బోగస్‌ వెబ్‌సైట్‌ సృష్టించి నకిలీ వీసాలను చూపించి రూ.5 కోట్లకు టోకరా ఇచ్చాడు ఓ రాజస్తానీ యువకుడు. రాష్ట్రంలోని 5 జిల్లాలకు చెందిన 300 మంది చెల్లించిన లక్షలతో ఉడాయించాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటనలో పొరుగు జిల్లాల్లోనూ బాధితులున్నారు.

షార్జా బల్దియా వీసాల పేరిట
షార్జాలోని బల్దియా (మున్సిపాల్‌) క్లీనింగ్‌ వీసాల పేరిట మోసం జరిగింది. రాజస్తాన్‌కు చెందిన మక్సూద్‌ అలీ (పాస్‌పోర్టు నంబరు ఎల్‌ 3833483) దుబాయి వెళ్లి వస్తాడు. సొంతగా ఓ నకిలీ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసి అందు లో నకిలీ వీసాలను తయారు చేసి అప్‌లోడ్‌ చేశాడు. దుబాయి, షార్జాల్లో పని చేసే వలస కార్మికులకు బల్దియా వీసాలు ఉన్నాయని నమ్మించాడు. మీకు బంధువులకు వీసాలు ఇవ్వండి అంటూ మక్సూద్‌ చెప్పాడు. దీంతో పలువురు వలస జీవులు సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల జిల్లాలోని సమీప బంధువులకు షార్జా బల్దియా వీసాలు ఉన్నాయని చెప్పారు.

అవసరమైతే వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకుని వీసాలకు డబ్బులు చెల్లించాలని సూచించారు. షార్జాలో ఉన్న ఆత్మీయులే ఇలా చెప్పడంతో నమ్మిన పలువురు వెబ్‌సైట్‌ చెక్‌ చేయడంతో వీసాలు ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. దీంతో ఒక్కొక్కరు రూ.1.80 లక్షల నుంచి రూ.2.30 లక్షల వరకు వీసాలకు చెల్లించారు. ఇలా సుమారు 300 మంది యువకులు రూ.5 కోట్ల వరకు చెల్లించినట్లు సమాచారం. ఆ డబ్బులను తీసుకున్న మక్సూద్‌ నకిలీ వీసాలతో అందరినీ మోసం చేశాడు.

బయట పడిందిలా..
నిజామాబాద్‌ జిల్లా దర్పల్లి మండలానికి చెందిన ఓ ఎంపీటీసీ సభ్యులు గల్ఫ్‌ ఏజెంట్‌గా పనిచేస్తారు. ఆయన 36 మందికి సంబంధించి రూ.56 లక్షలను మక్సూద్‌కి చెల్లించాడు. ఏడుగురు అభ్యర్థులను ఇటీవల షార్జా పంపించగా.. షార్జా ఎయిర్‌పోర్టు అధికారులు అవి నకిలీ వీసాలని గుర్తించి వారిని ఎయిర్‌పోర్టు నుంచే వెనక్కి పంపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్‌ మండలం ఫాజుల్‌నగర్‌ శివారు తుర్కాసికాలనీకి చెందిన మరో పది మందిని స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు షార్జా పంపేందుకు హైదరాబాద్‌ పంపారు. శంషాబాద్‌విమానాశ్రయం అధికారులు నకిలీ వీసాలను గుర్తించి ఆ పది మందిని వెనక్కి పంపారు. మక్సూద్‌ ఇచ్చిన వెబ్‌సైట్‌ను చెక్‌ చేస్తే.. అది నకిలీదని తేలింది. దీంతో తాము మోసపోయామనే విషయం బాధితులకు అర్థమైంది.  కాగా, 36 మంది మోసపోయినట్లు తెలియడంతో దర్పల్లికి చెందిన ప్రజాప్రతినిధి గుండెపోటుకు గురై∙ఆస్పత్రి పాలయ్యాడు.

మరిన్ని వార్తలు