బోగస్‌..సీరియస్‌

29 Jan, 2019 10:42 IST|Sakshi
ఓపీ రావత్, రజత్‌కుమార్‌ల పేరిట ముద్రించిన పోల్‌ స్లిప్‌లు

నకిలీ ఓటరు గుర్తింపు కార్డుల వ్యవహారం

నాంపల్లి నియోజకవర్గంలో ఎన్నికల అధికారుల పేర్లు

ఓపీ రావత్, రజత్‌కుమార్‌ పేర్లతో గుర్తింపు కార్డులు

సీసీఎస్‌లో ఫిర్యాదు చేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు

కేసు నమోదు, సమగ్ర దర్యాప్తునకు బృందం ఏర్పాటు

సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల సంఘం మాజీ చీఫ్, ప్రస్తుత ఉన్నతాధికారులను నాంపల్లి నియోజకవర్గ ఓటర్లుగా పేర్కొంటూ రిజిస్టర్‌ చేయించడం, నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు పొందడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటూ సమగ్ర విచారణకు ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ అధికారులు నగర నేర పరిశోధన విభాగంలో (సీసీఎస్‌)  ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశామని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని సీసీఎస్‌ డీసీపీ అవినాష్‌ మహంతి సోమవారం ‘సాక్షి’కి తెలిపారు. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన  అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారీ స్థాయిలో నకిలీ ఓట్లు రిజిస్టర్‌ అయ్యాయంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. నాంపల్లి సహా మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు సైతం చేశాయి.

వీటిని పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం వీలున్నంత వరకు  నకిలీ ఓటర్లను తొలగించింది. అయితే నాంపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసిన ఫిరోజ్‌ఖాన్‌ జనవరి 25న నకిలీ ఓటర్లకు సంబంధించి ఉదాహరణలు అంటూ రెండు పేర్లను బయటపెట్టారు. ఆ నియోజకవర్గంలోని ఓవైసీ నగర్‌లోని చిరునామా నుంచి మాజీ సీఈసీ ఓమ్‌ ప్రకాష్‌ రావత్, ప్రస్తుతం ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ పేర్లు, ఫొటోలతో నమోదై ఉన్నాయంటూ పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఆధారాలుగా డబ్ల్యూఆర్‌హెచ్‌ 2400372, డబ్ల్యూఆర్‌హెచ్‌ 2400380 నెంబర్లతో ఓటర్‌ స్లిప్పుల్ని సైతం ఆయన ప్రదర్శించారు. దీంతో ఈ విషయం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం సమగ్ర విచారణకు ఆదేశించింది. నగరానికి సంబంధించిన ఓటరు జాబితాలు, నమోదు అంశాలను జీహెచ్‌ఎంసీ పర్యవేక్షిస్తుంది. ఈ నేపథ్యంలోనే అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ ఆ అధికారుల్ని ఆదేశించింది. దీంతో జీహెచ్‌ఎంసీ మెహదీపట్నం ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ మహ్మద్‌ ఖాజా ఇంకెషాఫ్‌ అలీ శనివారం సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఐపీసీలోని 419, 465, 471 సెక్షన్లతో పాటు ఆర్పీ యాక్ట్‌లోని సెక్షన్‌ 31, ఐటీ యాక్ట్‌లోని సెక్షన్‌ 66 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఐపీ అడ్రస్‌ గుర్తింపుపై దృష్టి...
జీహెచ్‌ఎంసీ అధికారులు చేపట్టిన ప్రాథమిక విచారణ నేపథ్యంలో ఈ రెండు పేర్లు నమోదుకు సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు వచ్చినట్లు గుర్తించారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలోనే సీసీఎస్‌ పోలీసులు తమ కేసులో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) యాక్ట్‌ను చేర్చారు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం ఈ దరఖాస్తు ఏ ఐపీ అడ్రస్‌ నుంచి అప్‌లోడ్‌ అయిందో తెలుసుకోవడంపై దృష్టి పెట్టింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగంలో అనేక మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఉన్నారు. ఈ దరఖాస్తు పరిశీలన, ఓటర్‌ జాబితాలో పేర్లు చేర్చడంలో వీరి నిర్లక్ష్యం ఏమైనా ఉందా? అనే కోణం పైనా దృష్టి పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. సదరు వ్యక్తులు దురుద్దేశంతో, ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేసినట్లు భావిస్తున్నామని మెహదీపట్నం ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ మహ్మద్‌ ఖాజా ఇంకెషాఫ్‌ అలీ అన్నారు. 

మరిన్ని వార్తలు