‘జల’దోపిడీ

25 Nov, 2015 00:06 IST|Sakshi
‘జల’దోపిడీ

నాణ్యత గాలికి
 అనుమతిలేని వాటర్ ప్లాంట్లు
 యథేచ్ఛగా నీటి అమ్మకాలు
 సిండికేట్‌గా మారి ధరల పెంపు
 బీఐఎస్ సర్టిఫికెట్ లేకుండానే కొనసాగింపు
 ధనదాహమే లక్ష్యంగా నిర్వహణ

 జవహర్‌నగర్ జనాభా దాదాపు రెండు లక్షలు. గ్రామ పంచాయతీ ఏర్పడిన నాటి నుంచి తాగునీరు సరఫరా లేదు. దీంతో ఇబ్బడి ముబ్బడిగా గ్రామంలో దాదాపు 35 మినరల్ వాటర్ ప్లాంట్లు వెలిశాయి. నీటి ప్లాంట్ల నిర్వహణకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (బీఐఎస్) అనుమతులు ఉండాలి. అదేవిధంగా యూవీ కిరణాల ద్వారానే నీటిని శుభ్రం చేయాలి. ప్లాంట్ల సామర్థ్యం 30 హెచ్‌పీ దాటితే పంచాయతీ, విద్యుత్, భూగర్భ శాఖ అధికారుల అనుమతి తీసుకోవాలి. ప్రతీ ప్లాంటులో కెమిస్ట్రీ, మైక్రో ల్యాబ్‌లు ఉండాలి.
 
 నీటిని తొలుత క్లోరినేషన్, ఆపై శాండ్ ఫిల్టర్‌లో వడగట్టి తర్వాత కార్బన్ ఫిల్టర్‌లో 25 మైక్రాన్ కంటే సూక్ష్మ స్థాయిలో ఉన్న ఫిల్టర్‌లో నీటిని వడకట్టాలి. ఇలా వచ్చిన నీటిని మాత్రమే వినియోగించాలి. కానీ చాలా ప్లాంట్లు అనుమతులు లేకుండా, నిబంధనలు పాటించకుండా కేవలం ఆర్‌ఓ సిస్టం ద్వారానే నీటిని శుద్ధి చేసి నీటిని విక్రయిస్తున్నాయి. ఇలా.. ఒక్కొక్కరు రోజుకు సరాసరి 400 క్యాన్లు విక్రయిస్తున్నారు. నెలకు 12 వేల క్యాన్ల విక్రయిస్తున్నారు.
 
 కాలనీకో ప్లాంటు
 గ్రామంలో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కాలనీకో వాటర్ ప్లాంటు చొప్పున దాదాపు 35 పైగా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో బోర్లను ఏర్పాటు చేసి నీటిలో కొన్ని లవణాలను తొలగించి నీటిని విక్రయిస్తున్నారు. నీటిని శుభ్రం చేసి ప్యాకింగ్ చేయాలంటే ఆహార నిరోధక శాఖ అధికారుల నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సి ఉన్నా.. ఇక్కడ అలా జరగడం లేదు. కనీసం క్యాన్లను కూడా శుభ్రం చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది.
 
 జాడకైనా కనిపించని ఐఎస్‌ఓ
 మినరల్, ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్లలో కనీస నియమాలు పాటించి, స్వచ్ఛమైన నీటిని అందించే ప్లాంట్లకు ఐఎస్‌ఓ అనుమతి ఉంటుంది. జవహర్‌నగర్‌లోని ఆయా ప్లాంట్లకు అసలు ఐఎస్‌ఓ కాదు కదా, పంచాయతీ అనుమతి సైతం లేదు. ఇక యూవీ సిస్టం అసలుకే కనపడవు.

 పట్టించుకోని అధికారులు
  ఇంత జరుగుతున్నా.. అధికారులు మాత్రం మామూళ్లను తీసుకుంటూ తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. వాటర్ ప్లాంట్ నిర్వాహకులు కలుషిత నీటిని సరఫరా చేస్తున్నారని గతంలో పలుమార్లు సార్లుఆందోళనలు నిర్వహించినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 తాగునీటిని విక్రయించాలంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (బీఐఎస్) అనుమతి తప్పనిసరి. దీనికి తోడు నీటిని మూడు దశల్లో శుద్ధి చేయాల్సి ఉంటుంది. నాణ్యమైన కవర్లు, బాటిళ్లు వినియోగించాలి. అయితే ధనార్జనే ధ్యేయంగా కేవలం ఆర్‌ఓ సిస్టం ద్వారానే నీటిని శుద్ధి చేసి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు ప్లాంట్ నిర్వాహకులు. ఇలాంటి నీటినే జవహర్‌నగర్‌లో ప్రతి వెయ్యి మందిలో 80 శాతం మందికి పైగా వినియోగిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.     - జవహర్‌నగర్
 
 సిండికేట్‌గా ధరల పెంపు
 తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు సిండికేట్‌గా మారి నీటి క్యాన్ల ధరను అమాంతగా పెంచేశారు. గతంలో ప్లాంట్ వద్ద క్యాన్ వాటర్‌కు రూ. 5 ఉండగా ప్రస్తుతం దానిని రూ. 8కు పెంచారు. ఇంటికి సరఫరా చేస్తే గతంలో రూ. 10 ఉండగా ప్రస్తుతం అది కాస్తా రూ. 20కి చేరింది.
 
 
 అనుమతులు లేకపోతే  కఠిన చర్యలు
 అనుమతులు లేకుండా వాటర్ ప్లాంట్లు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. వారం రోజుల్లో గ్రామంలోని అన్ని ప్లాంట్లను తనిఖీ చేస్తాం. నిబంధనలకు పాటించని వారిపై వాల్టాచట్టం కింద కేసు నమోదు చేస్తాం.
 - దేవుజా నాయక్, తహశీల్దార్, శామీర్‌పేట
 
 పత్తాలేని మంజీరా నీరు
 జవహర్‌నగర్ ఏర్పడిన నాటిన నుంచి తాగునీటి సమస్య నేటికీ తీరలేదు. ఎన్నికల సమయంలో మాత్రం పాలకులు మంజీనా నీటిని అందిస్తామని చెబుతున్నా.. దానిని అమలులో ప్రజాప్రతినిధులు, అధికారులు విఫలమయ్యారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, మంత్రులు స్పందించి అనుమతి లేని వాటర్ ప్లాంట్లను సీజ్ చేసి గ్రామానికి మంజీరా నీరు అందించాలని కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు