భగ్గుమంటున్న భానుడు

18 Mar, 2014 01:57 IST|Sakshi
భగ్గుమంటున్న భానుడు
 •       సిటీలో పగలు సెగలు
 •      అనారోగ్యం పాలవుతున్న సిటిజన్లు
 •  సాక్షి, సిటీబ్యూరో: భానుడు భగ్గున మండుతున్నాడు. ఉదయం 10 గంటలకే సూర్యుడు సెగలు కక్కుతున్నాడు. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు వేడికి అల్లాడుతున్నారు. మండె ఎండలకు ఉక్కపోత తోడవ్వడంతో సిటిజన్లు అసౌకర్యానికి గురవుతున్నారు. పగలు కరెంట్ సరఫరా నిలిపివేస్తుండటంతో ఇంట్లో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు పనిచేయక పోవడంతో ఇరుకైన అపార్ట్‌మెంటుల్లో నివాసం ఉండేవారు ఉక్కకు తట్టుకోలేక పోతున్నారు.

  తాజాగా సోమవారం గరిష్ట 35.6, కనిష్ట  21.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్ తర్వాత మరెలా ఉంటుందోనని సిటిజన్లు భయపడుతున్నారు. గ్రేటర్‌లో రోజు రోజుకు పెరుగుతున్న వాహన, పారిశ్రామిక కాలుష్యం వల్ల వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
   
  చమట పొక్కులతో చికాకే..:
   
  ఎండ తీవ్రతకు చిన్నారులు,వృద్ధులు, బాలింతలు, గర్భిణులు, టూవీలర్స్‌పై ప్రయాణించే మా ర్కెటింగ్ ఉద్యోగులు, యువ తీయువకులు చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. తెల్లవారు జామున చలి, మధ్యాహ్నం ఎండ వల్ల చర్మం పొడిబారుతోంది. ఉక్కపోత వల్ల మెడ, కాళ్లు, చేతులపై పొక్కులు వస్తున్నాయి. ముఖం వాడిపోవడంతో పాటు నుదురు, బుగ్గలపై నల్లని మచ్చలు ఏర్పడుతున్నాయి. మానసికంగా ఎంతో అలసి పోవడంతో పాటు వడదెబ్బ, జ్వరం బారిన పడుతున్నారు. సాధ్యమైనంత వరకు ఎండలో భయటికి వెళ్లక పోవడమే ఉత్తమం. తప్పని పరిస్థితుల్లో బయటికి వెళ్లాల్సి వస్తే వాటర్ బాటిల్, గొడుగు విధిగా వెంట తీసుకెళ్లాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
   
   టైట్ జీన్స్ వల్ల ఫంగల్ ఇన్‌ఫెక్షన్

   సూర్యుని వైపు చూడటం వల్ల కిరణాల తాకిడికి చూపు దెబ్బతినే ప్రమాదం ఉంది. తేలికైన తెల్లని కాటన్ దుస్తులు ధరించాలి. టైట్ జీన్స్, బిగుతు లోదుస్తులు వల్ల ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. చిన్నారులకు చెమట పొక్కులు రాకుండా కూల్ పౌడర్లు వాడాలి. చన్నీటితో రోజుకు రెండుసార్లు స్నానం చేయాలి. - డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్, నిలోఫర్ చిన్నపిల్లల వైద్యశాల
   
  సన్‌లోషన్స్ రాసుకోవాలి

   చిన్నారులు, వద్ధులు, గర్భిణులు, బాలింతలు సాధ్యమైనంత వరకు బయటికి వెళ్లకూడదు. ఏమైన పనులు ఉంటే ఉదయం పూర్తి చేసుకుని ఎండ ముదిరే సమయానికి ఇంటికి చేరుకోవాలి. స్కిన్ గ్లో తగ్గకుండా ఉండాలంటే బయటికి వెళ్లే ముందు చర్మానికి సన్‌లోషన్స్ అప్లైయ్ చేయాలి.
   - డాక్టర్ మన్మోహన్, ప్రొఫెసర్ ఉస్మానియా మెడికల్ కళాశాల
   
   మసాలా ఫుడ్డు వద్దేవద్దు
   మసాలా ఫుడ్డుకు బదులు, సులభంగా జీర్ణం అయ్యే పెరుగు అన్నం తీసుకోవాలి. కలుషిత నీరు కాకుండా శుభ్రమైన ఫ్యూరిఫైడ్ మంచి నీటిని వాడాలి. శీతల పానీయాలకు బదులు పండ్ల రసాలు, కొబ్బారి బొండాలు తాగాలి. డీహైడ్రేషన్ కాకుండా ఉండేందుకు రోజుకు కనీసం ఐదు లీటర్ల మంచి నీరు తాగాలి.
   - డాక్టర్ సంగీత, అపోలో, డీఆర్‌డీఎల్
   
   చలువ అద్దాల ఎంపికలో జాగ్రత్త
   సూర్యుని వైపు చూడటం వల్ల కిరణాల తాకిడికి చూపు దెబ్బతినే ప్రమాదం ఉంది. రోడ్డుసైడ్ లభించే కూలింగ్ గ్లాసులు కంటికి మేలు చేయక పోగా మరింత హాని చేస్తాయి. యాంటి రిఫ్లెక్షన్ బ్లాక్, బ్రౌన్ కలర్ గ్లాసులు ఎంపిక చేసుకోవాలి. ఇంటి నుంచి బయటికి వెళ్లి వచ్చిన ప్రతిసారి కళ్లను శుభ్రం చేసుకోవాలి.
   - డాక్టర్ రవీందర్, ప్రముఖ కంటి వైద్యనిపుణుడు
   

మరిన్ని వార్తలు