ఓటమి భయంతోనే తప్పుడు ప్రచారం

4 Dec, 2018 12:46 IST|Sakshi
గద్వాల అర్బన్‌: బీజేపీ అభ్యర్థి వెంకటాద్రి రెడ్డికి సమస్యలు తెలియజేస్తున్న మహిళలు

సాక్షి, గద్వాల రూరల్‌: రానున్న ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటాద్రిరెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అధికార ప్రేలాపనతోనే గ్లోబల్‌ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

1983 నుంచి 2000వరకు టీడీపీ హయాంతో జెడ్పీటీసీగా నియోజకవర్గంలోని కార్యకర్తలకు, నమ్మిన వారికి అండగా ఉన్నానని, అదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు. అవినీతి అక్రమ వ్యాపారాలతో సంపాదించిన డబ్బుతో విచ్చలవిడిగా ఖర్చు పెట్టి అధికారంలోకి వచ్చేందుకు కుతంత్రాలు పన్నుతున్నారన్నారు.

ప్రజలు విజ్ఞులని, ఎవరికి పట్టం కట్టాలో ఇప్పటికే నిర్ణయించుకున్నారని చెప్పారు. గట్టుభీముడు ఎన్నికైనప్పుడు నాలుగు సంవత్సరాల పాటు బంగ్లా కుటుంబం నియోజకవర్గానికి దూరంగా ఉందన్నారు. 2004లో జరిగిన ఎన్నికల్లో తిరిగి నా మద్దతుతోనే ఎన్నికల్లో గెలుపొందారన్నారు. ఇదే పార్టీలో తుదిశ్వాస వరకు ఉంటానని, ప్రతి కార్యకర్తకు అండగా ఉండి ఆదుకుంటానన్నారు.

రానున్న కాలంలో కేంద్ర, రాష్ట్రాల్లో ఏర్పడేది బీజేపీ ప్రభుత్వమేనని, నీతివంతమైన పాలనతో పాటు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా కృషి చేస్తానన్నారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు రవికుమార్‌ ఎగ్బోటే, సీనియర్‌ నాయకులు అయ్యపురెడ్డి, కేశవరెడ్డి, శివశంకర్, తిరుమల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


విద్వత్‌ గద్వాలగా తీర్చిదిద్దుతా...
గద్వాల అర్బన్‌: గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా గద్వాల ప్రాంతం విద్యలో వెనుకబడిందని, బీజేపీని గెలిపిస్తే విద్వత్‌ గద్వాల మార్చి పూర్వవైభవం తెస్తానని బీజేపీ అభ్యర్థి వెంకటాద్రిరెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని గంటవీధిలో పర్యటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అత్తా, అల్లుళ్లను ఇంటికి సాగనప్పిన రోజే గద్వాలలో ప్రగతి సాధ్యమవుతుందని అన్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు. రవికుమార్, శ్రీనాథ్‌రెడ్డి, శ్రీనివాసులు, మోహన్, విజయ్‌మోహన్, అఖిల్‌ పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు