నగరంలో విషాదం: నలుగురి ఆత్మహత్య

17 Mar, 2018 03:35 IST|Sakshi

ఇద్దరు పిల్లలతో సహా భార్య భర్త ఆత్మహత్య

మృతులు పశ్చిమ బెంగాల్‌ వాసులు

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో దారుణం చోటు చేసుకుంది. బెంగాల్‌కు చెందిన వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం, మహంకాళి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కండోజీబజార్‌లో జరిగిన ఈ ఘటన నగరంలో  కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగాల్‌కు ఘోష్‌పార గ్రామం డోంజార్, హౌరాకు చెందిన స్వరూప్‌ గోపాల్‌ దాస్‌ (37) కొన్నేళ్ల కిత్రం నగరానికి వలస వచ్చాడు. ఆయనకు భార్య దీప (30) ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇందులో పెద్ద కుమార్తె  టిట్లీ దాస్‌ (5) పార్క్‌లేన్‌లోని బీఆర్‌జేసీ పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతుంది. అలాగే మరో ఐదు నెలల కుమార్తె ఉంది. 

స్వరూప్‌ గోపాల్‌ దాస్‌ జనరల్‌ బజార్‌లో గోల్డ్‌స్మిత్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం విమల్‌ అనే వ్యక్తి తాను ఇచ్చిన నగల కోసం ఫోన్‌ చేస్తున్నాడు. మధ్యాహ్నం 1.30 నిమిషాలకు షాప్‌కు వస్తున్నానంటూ చెప్పి ఫోన్‌ పెట్టేశాడు. కానీ సాయంత్రం వరకు రాకపోవడంతో విమల్‌ స్వరూప్‌ ఇంటికి  వచ్చి చూడగా ఇంట్లో గడియ పెట్టి ఉండటంతో వెనక్కి వెళ్లి పోయాడు. సాయంత్రం  మరో సారి వచ్చి చూడగా ఇంట్లో పెద్దగా టీవీ శబ్ధం వస్తుందే తప్ప ఎవరూ పలకడం లేదు. దీంతో రాత్రి 8 గంటల సమయంలో విమల్‌ మహంకాళి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌ సంఘటనా స్థలానికి చేరుకుని కిటీకి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా నలుగురు విగత జీవులుగా పడివున్నారు. పోలీసులు మృతదేహాలను గాంధీ మార్చురికీ తరలించారు. మహంకాళీ ఏసీపీ వినోద్‌కుమార్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. 

ఆర్థిక సమస్యలే కారణమా?
స్వరూప్‌ గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు. దీంతో పోలీసులు బెంగాల్‌కు చెందిన వారందరిని తీసుకుని వచ్చి మృతుల వివరాలను ఆరాతీస్తున్నారు. తెలిసిన వారు ఎవరూ లేకపోవడంతో ఆయన కుటుంబం ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మృతదేహాల వద్ద సైనైడ్‌ లాంటిది పడివుండటంతో దాన్ని మింగి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని బావిస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి గోల్డ్‌ స్మిత్‌లు అందరు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

మరిన్ని వార్తలు