రోదనలతో మిన్నంటిన మార్చురీ..

12 Jan, 2020 10:00 IST|Sakshi
హారతి మృతదేహం వద్ద నివాళులర్పిస్తున్న వరంగల్‌ అర్బన్‌ జెడ్పీ చైర్మన్, మాజీ మేయర్‌

పూర్తయిన హారతి పోస్టుమార్టం కుటుంబ సభ్యులు,

ప్రజాసంఘాల నాయకుల రాక

నిందితుడిని కాల్చేయాలంటూ నినాదాలు

భారీ బందోబస్తు ఏర్పాటుచేసిన పోలీసులు

సాక్షి, ఎంజీఎం: హన్మకొండ రాంనగర్‌లో యువకుడు షాహిద్‌ చేతిలో హత్యకు గురైన మునిగాల హారతి మృతదేహానికి శనివారం ఎంజీఎం ఆస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించారు. ఆ తర్వాత మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఎంజీఎం మార్చురీ వద్ద హారతి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్దసంఖ్యలో చేరుకుని రోదించడం ప్రతిఒక్కరిని కలిచివేసింది. నిందితుడిని వెంటనే కాల్చి చంపేయాలి.. వెంటనే ఊరి తీయాలి అంటూ మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రోదిస్తూ వేడుకున్నారు.

బందోబస్తు... ఆందోళన
హారతి మృతదేహానికి పోస్టుమార్టం సందర్భంగా ఎంజీఎం మార్చురీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్‌ చేస్తూ మహిళా, ప్రజాసంఘాలు ఆందోళనకు దిగారు. నిందితుడిని తమకు అప్పగిస్తే తామే చూసుకుంటామని తెలిపారు. అప్పటికే మార్చురీ వద్ద భారీగా మొహరించిన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పాల్పడకుండా చూశారు.నిర్వహించారు.

షాహిద్‌ను కఠినంగా శిక్షించాల్సిందే...
కాజీపేట: ప్రేమ పేరుతో యువతి ప్రాణాలను తీసిన యువకుడి విషయంలో ఆయన స్వస్థలమైన కాజీపేట విష్ణుపురి వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల అదుపులో ఉన్న షాహిద్‌ను పోలీసులు ప్రత్యేక వాహనంలో కాజీపేటలోని ఇంటికి తీసుకొచ్చి రక్తం మరకలతో ఉన్న దుస్తులు, కత్తి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడితో వచ్చిన పోలీసులు ఏమైనా గొడవ జరుగుతాయనే భావనతో 10 నిమిషాల లోపే ఇంటి నుంచి కావాల్సినవి తీసుకుని వెళ్లిపోయారు. కాగా, చదువుకునే సమయంలో బంధుమిత్రులు, పాటు కాలనీవాసులతో మంచిగా ఉండే షాహిద్‌ ఓ నిండు ప్రాణాన్ని తీశాడంటే నమ్మలేకపోతున్మామని ఈ సందర్భంగా స్థానికులు పేర్కొన్నారు.

విషయం తెలియగానే ఖంగుతిన్నాం...
తమ కుమారుడు ప్రేమించిన యువతిని చంపి ఇంటికి వచ్చివెళ్లాడని తెలియగానే ఖంగు తిన్నామని షాహిద్‌ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కొడుకు ఈ ఘాతుకానికి ఎందుకు పాల్పడి ఉంటాడో అర్థం కావడం లేదని వాపోయారు. తన కొడుకు తప్పు చేసి ఉంటే శిక్ష అనుభవించాల్సిందేనని తెలిపారు. కాగా, ఘటన సమాచారం తెలియగానే షాహిద్‌ తల్లిదండ్రులు శుక్రవారం రాత్రే ఇళ్లు విడిచి బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు.

ప్రభుత్వం, పోలీసుల నిర్లక్ష్యంతోనే హత్యలు..
ప్రభుత్వం, పోలీసుల నిర్లక్ష్యంతోనే మహిళల హత్యలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయని బీజేపీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆరోపించారు. మార్చురీ వద్ద హారతి కుటుంబసభ్యులను పరామర్శించి ఆమె మాట్లాడుతూ ఎంపీలు, ఎమ్మెల్యేలు పరామర్శలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. ఇలాంటి కేసుల్లో నిందితులపై 21 రోజుల్లో చర్యలు తీసుకునేలా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసిన మాదిరిగా చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ నాయకులు కొలను సంతోష్‌రెడ్డి, పుప్పాల రాజేందర్, మందాటి వినోద్, పాశికంటి రాజేంద్రప్రసాద్, కమల్, కనుకుంట్ల రంజిత్, నిర్మల, ఆడుప మహేష్, ముత్తినేని శ్రీనివాస్, రత్నాకర్, కృష్ణ, రాజేశ్‌ పాల్గొన్నారు.

పోలీసుల రక్షణలో నిందితుడి ఇల్లు..
మృతురాలి కుటుంబసభ్యులతో పాటు బంధువులు నిందితుడి ఇంటిపై దాడి చేయొచ్చనే భావనతో ముందు జాగ్రత్తగా షాహిద్‌ ఇంటి వద్ద సాయుధ పోలీసులను కాపాలాగా పెట్టారు. ఓ రక్షక్‌ వాహనం కూడా తీసుకొచ్చారు. 

చట్టపరంగా శిక్షపడేలా చర్యలు
ఎంతో భవిష్యత్‌ ఉన్న యువతి హారతి హత్య కు గురవడం అత్యంత దురదృష్టకరమని రాష్ట్ర గిరిజన స్త్రీ సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ పేర్కొన్నారు. ఎంజీఎం మార్చురీలో ప్రభుత్వ చీఫ్‌ దాస్యం వినయ్‌ భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్‌తో కలి సి హారతి మృతదేహాన్ని సందర్శించిన ఆమె మృతురాలి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆ తర్వాత మంత్రి మాట్లాడుతూ నిందితుడికి చట్టపరంగా శిక్ష పడేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మహిళల భద్రతపై ప్రభుత్వం, పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం దురదృష్టకరమన్నారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆదేశించారని మంత్రి తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రజల్లో చైతన్యం రావాలని,.. ఇదే సమయంలో ఎలా నిరోధించాలనే అంశాలపై ప్రభుత్వం, పోలీసులు దృష్టి సారిస్తుందని చెప్పారు. చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ ఇప్పటికే నిందితుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడని, నిందితుడికి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 
గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, సత్యవతి రాథోడ్‌

మరిన్ని వార్తలు