కు.ని. కష్టాలు

2 Mar, 2016 02:26 IST|Sakshi
కు.ని. కష్టాలు

కనీస సౌకర్యాలు కల్పించని అధికారులు
కోల్‌సిటీ : గోదావరిఖని ప్రభుత్వాస్పత్రిలో మంగళవారం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించారు. మొత్తం 90 మంది మహిళలు, పురుషులు శస్త్రచికిత్స కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఉదయం ఆపరేషన్లు చేస్తామని చెప్పిన అధికారులు సాయంత్రం 4గంటల వరకు కూడా ప్రారంభించలేదు. దీంతో భోజనాలు చేయకుండా వచ్చిన కొంతమంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు. సరిపడా కుర్చీలు, బెంచీలు ఏర్పాటు చేయకపోవడంతో ఆపరేషన్ థియేటర్‌లో నేలపై, మెట్లపై కూర్చొని డాక్టర్ల కోసం పడిగాపులు కాశారు. రాత్రి వరకు 65 మంది మహిళలకు  డాక్టర్ రజినీప్రియదర్శిని, 22 మంది పురుషులకు డాక్టర్ రవీందర్ ఆపరేషన్లు చేశారు.

శస్త్రచికిత్స చేసిన తర్వాత మహిళలను నేలపై పడుకోబెట్టారు. ఆస్పత్రిలో ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ప్రతిసారీ ఇదే దుస్థితి ఎదురవుతోంది. కు.ని. ఆపరేషన్లలో క్లస్టర్ మెడికల్ ఆఫీసర్ భిక్షపతి, ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ సూర్యశ్రీ, డాక్టర్లు కృపాభాయి, రవళి, రాణి, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు