ఇదేమి సహకారమో..!

31 Jul, 2019 10:25 IST|Sakshi
బ్యాంక్‌ పంపిన డిమాండ్‌ నోటీస్‌

సాక్షి, సైదాపూర్‌(హుజూరాబాద్‌) : సహకార సంఘంలో అప్పులు తీసుకోకున్నా, అప్పులు తీసుకున్నట్లు డిమాండ్‌ నోటీసులు ఇచ్చి ఆయా కుటుంబాల్లో చిచ్చు పెట్టిన సంఘటన సైదాపూర్‌లో  చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గొడిశాలకు చెందిన పిన్నింటి రాంరెడ్డికి సంఘంలో అప్పు లేకున్నా రూ.77,500 అసలు అప్పు, దానికి మిత్తి కింద రూ.4,140 చెల్లించాలని సంఘం పేరున డిమాండ్‌ నోటీసులు జారీ అయ్యాయి.

బాధిత రైతు విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాంరెడ్డి సహకార సంఘంలో 2001లో లాంగ్‌టర్మ్‌ రుణం తీసుకున్నాడు. ఆ రుణం మొత్తం 2003 డిసెంబర్‌ 31న పూర్తిగా చెల్లించాడు. పిల్లల చదువు కోసం కరీంనగర్‌ వచ్చి, రెడ్డి మార్బుల్‌ షాపులో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. పిల్లల చదువు కోసం కరీంనగర్‌లో ఓ బ్యాంకులో స్టడీ లోన్‌కు దరఖాస్తులు చేసుకున్నాడు. స్వగ్రామంలో ఇతర బ్యాంకుల్లో అప్పులేనట్లు నోడ్యూస్‌ సర్టిఫికెట్‌ అడగడంతో సైదాపూర్‌లోని కేడీసీసీ, వైశ్యాబాంకుల్లో నోడ్యూస్‌ సర్టిఫికేట్లు తీసుకున్నాడు.

ఇలా ఉండగా ఈనెల 27న రాంరెడ్డి పేరున గొడిశాలలో ఓ బెల్టుషాపులో నోటీస్‌ ఇచ్చారు. ఈ విషయం రాంరెడ్డి ఇంట్లో తెలిసింది. బ్యాంకుల్లో అప్పులు తెచ్చి ఏం చేశావని ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవ ముదిరింది. దీంతో  గొడిశాలకు వచ్చిన రాంరెడ్డి నోటీసులు తీసుకోని సహకారం సంఘంలో కలిశాడు. పాత బాకీ కట్టిన రశీదులు, నో డ్యూస్‌ పత్రం కూడా చూపించాడు. అప్పు లేకుంటే నోటీసులు ఎందుకు ఇస్తాం. రికార్డులు చూడాలి. అని సీఈవో బిక్షపతి బదులిచ్చాడు. అప్పు లేకున్నా, అప్పు ఉన్నట్లు నోటీసులు ఇచ్చి సహకార సంఘం అధికారులు పరువు తీశారని విలేకరులతో రాంరెడ్డి మొరపెట్టుకున్నారు. దీనిపై సీఈవో వివరణ కోరగా వాస్తవంగా రాంరెడ్డి పేరున అప్పు లేదు. పొరపాటున నోటీస్‌ వెళ్లిందని వివరణ ఇచ్చాడు.   

మరిన్ని వార్తలు