యాచకుడిగా మారిన క్రీడాకారుడు

5 Oct, 2017 14:20 IST|Sakshi

శరవేగంగా ఆలోచించాలి. ఎత్తులకు పై ఎత్తులు వేయాలి. ఎదుటివాడి తెలివికి చెక్‌ చెప్పాలి. అప్పుడే విజయం. అది జీవితమైనా, చదరంగం ఆటైనా... అయితే చదరంగంలో అవలీలగా గెలిచిన ఓ క్రీడాకారుడు జీవిత సమరంలో మాత్రం కూలబడి, ఓడిపోయాడు. పతకాలు, పురస్కారాలు అందుకున్న అదే చేయి ఇప్పుడు చిల్లర కోసం యాచిస్తోంది.

సాక్షి, హైదరాబాద్‌ (తార్నాక): ఎం.వై రాజు. ప్రతిభ కలిగిన చదరంగ క్రీడాకారుడు.. రెండు వేల రేటింగ్‌ కలిగిన ప్రతిభాశాలి. జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులతో పాటు బంగారుపతకం కూడా అందుకున్న ఆటగాడు. నగరంలో ఎక్కడ చెస్‌ టోర్నమెంట్‌ జరిగినా అక్కడ ప్రత్యక్షమయ్యేవాడు. ఒకప్పుడు రైల్వేలో మంచి ఉద్యోగం.. చదరంగంలో రాణింపు.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. జీవితంలో అన్నీ కోల్పోయాడు. ఆటకూ దూరమయ్యాడు. నాఅన్నవారే లేక యాచకుడిగా మారాడు.

కుటుంబ నేపథ్యం...  
రాజు ఒంగోలులో 1969లో పుట్టారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో తరచూ బదిలీల కారణంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆయన విద్యాభ్యాసం సాగింది. నగరంలోని సిటీ కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. రాజుకు చిన్ననాటి నుంచే చదరంగం అంటే అమితాసక్తి. ఈ విషయాన్ని గమనించిన తండ్రి రాజును బాగా ప్రోత్సహించారు. రూ.3 లక్షలు విలువ చేసే చదరంగం పుస్తకాల్ని అప్పట్లో కొనిచ్చారు. అదే స్ఫూర్తితో ఎదిగిన రాజు జాతీయస్థాయిలో క్రీడాకారుడిగా రాణించారు. ఆ ప్రతిభతోనే 1993లో దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగం సాధించారు.

గాడితప్పిన జీవితం..
చదరంగంలో జాతీయ స్థాయి క్రీడాకారుడిగా వెలిగిన రాజు జీవితం తల్లిదండ్రుల మరణంతో ఒక్కసారిగా గాడితప్పింది. అతడ్ని దురలవాట్ల వైపు మళ్లించింది. క్రీడను నిర్లక్ష్యం చేశాడు. విధులకు గైర్హాజరుకావడంతో ఉద్యోగం పోయింది. యాచకుడిగా మార్చింది.  

చదరంగంలో నేటికీ రాజే...
మానసిక పరిస్థితి అంతబాగాలేకున్నా కూడా రాజు చదరంగంలో నేటికీ రాజే. నగరంలో ఎక్కడ పోటీలు జరిగినా అక్కడకు వెళ్లి క్రీడలో గెలిచి ప్రైజ్‌మనీని తన ఖర్చులకు వినియోగిస్తున్నట్లు రాజు ‘సాక్షి’కి తెలిపారు.

క్రీడా ప్రస్థానం..  
1988 రాజమండ్రిలో జరిగిన జాతీయ జూనియర్‌ చెస్‌ పోటీల్లో పాల్గొని ఒక్క పాయింట్‌లో చాంపియన్‌షిప్‌ను కోల్పోయాడు.  
1992 నగరంలో జరిగిన ఇంటర్‌ యూనివర్సిటీ చెస్‌పోటీల్లో బంగారు పతకం.  
1992 కోల్‌కతాలో జరిగిన నేషనల్‌ చెస్‌ పోటీల్లో జాతీయ అవార్డు.   
2000 నగరంలో జరిగిన ఆల్‌ ఇండియా చెస్‌ పోటీల్లో గోల్డ్‌మెడల్‌.

ప్రస్తుతం..
రాజు నాలుగేళ్లుగా తార్నాక చౌరస్తాలోని గణపతిఆలయంలో యాచకుడిగా జీవితాన్ని గడుపుతున్నాడు. ఆయన ఆరోగ్యపరిస్థితిపై ఆందోళన చెందిన కొందరు మిత్రులు రెండు నెలల క్రితం వైద్యపరీక్షలు చేయించారు. స్కీజోఫ్రోనియాతో బాధపడుతున్నట్లు వైద్యులు తేల్చారు. మెరుగైన వైద్యం చేయించేందుకు మిత్రులంతా ఓ గ్రూప్‌గా ఏర్పడి సాయంమందించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ముందుకు వచ్చి రాజుకు వైద్యసాయమందించాలని స్నేహితులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు