ప్రముఖ మతగురువు షరీఫ్‌ కన్నుమూత 

15 Dec, 2018 03:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జామియా నిజామియా ఇస్లామిక్‌ విశ్వవిద్యాలయంలో షేకుల్‌ హదీస్‌ (మహ్మద్‌ ప్రవక్త ప్రవచనాల బోధకులు) మౌలానా మహ్మద్‌ ఖాజా షరీఫ్‌ (82) కన్నుమూశారు. కొన్ని రోజులు గా శ్వాస సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన తన జీవితాన్ని జామియా నిజా మియా ఇస్లామిక్‌ విశ్వవిద్యాలయానికి అంకితం చేశారు. షరీఫ్‌ స్వస్థలమైన మహబూబ్‌నగర్‌ జిల్లా పోట్లపల్లిలోని శ్మశానంలో శుక్రవారం సాయంత్రం ఆయన భౌతికకాయాన్ని ఖననం చేశారు. 

5 దశాబ్దాలుగా ప్రవక్త బోధనలు: ధార్మిక విద్యలో పట్టభద్రులైన తర్వాత షరీఫ్‌ అరబ్‌ భాషలో ప్రావీణ్యం సాధించారు. అనంతరం 1966లో జామియా నిజామియాలో హదీస్‌ అధ్యాపకుడిగా చేరారు. 50 ఏళ్లుగా జామియాలో వేలాది మందికి ప్రవక్త బోధనలను బోధించారు. పలు ధార్మిక పుస్తకాలను రాశారు. అరబ్‌ దేశాల పాలకుల ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లి ప్రవక్త బోధనలను అరబ్‌ భాషలో బోధించారు. దేశవిదేశాలకు చెందిన ఎంతోమంది ధార్మిక పండితులు ఆయన వద్ద విద్యను అభ్యసించారు.

దేశ విదేశాల్లో ఉన్న ఆయన శిష్యులు లక్షల మందికి ప్రవక్త బోధనలు చేస్తున్నారు. ఒక్క సౌదీ అరేబియాలోనే సుమారు 10 వేల మంది వరకు ఆయన శిష్యులు ఉంటారు. షరీఫ్‌ మరణంతో ముస్లిం సముదాయం గొప్ప విద్యాప్రదాతను కోల్పోయిందని హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ, పలువురు ఎమ్మెల్యేలు, ధార్మిక పండితులు ఆయనకు నివాళులర్పించారు. 
 

మరిన్ని వార్తలు