పౌల్ట్రీకి వ్యవసాయ హోదా!

4 Aug, 2014 02:31 IST|Sakshi
పౌల్ట్రీకి వ్యవసాయ హోదా!

హైదరాబాద్: కోళ్ల పరిశ్రమకు వ్యవసాయ హోదా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. తెలంగాణలో 25 వేల మందికిపైగా కోళ్ల పరిశ్రమలను నిర్వహిస్తున్నట్టు తనవద్ద సమాచారం ఉందన్నారు.  కోళ్ల పరిశ్రమ యజమానుల సంఘం అధ్యక్షుడు రంజిత్‌రెడ్డి నాయకత్వంలో పలువురు ప్రతినిధులు ఆదివారం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్‌ను కలి శారు. కోళ్ల పరిశ్రమకు విద్యుత్, మొక్కజొన్న సబ్సిడీలు ఇవ్వాలని కోరారు. కోళ్ల పరిశ్రమకు వ్యవసాయహోదా ఇచ్చే అంశాన్ని కూడా పరిశీ లించాలని చేసిన విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా  స్పందించారు. భేటీలో ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ కూడా పాల్గొన్నారు.

 పోలీసు వాహనాలను పరిశీలించిన సీఎం

 పోలీసు శాఖకు కొత్తగా అందుబాటులోకి తీసుకువస్తున్న  ఇన్నోవా, ద్విచక్ర వాహనాల నమూనాలను  ఆదివారం తన నివాసంలో సీఎం కేసీఆర్ పరిశీలించారు. డీజీపీ అనురాగ్‌శర్మ రెండు ఇన్నోవా, ఒక ద్విచక్ర వాహనాన్ని సీఎంకు చూపించారు. వాటిల్లో పోలీసులకు అవసరమైన  ఏర్పాట్లను, వాహనాల డిజైనింగ్‌ను సీఎంకు వివరించారు. ఇన్నోవా లోపల ఉన్న పోలీసు లోగోను ప్రస్తుతం ఏర్పాటు చేసిన స్థానం నుంచి  అందరికీ కనిపించేలా పక్కకు జరపాలని,   వాహనం ముందు భాగంలో రాసిన  అక్షరాల సైజును పెంచాలని సీఎం సూచించారు. ద్విచక్రవాహనంలో  కూడా  చిన్న మార్పులను సూచించారు.

సైగ్నస్ ఆస్పత్రిని ప్రారంభించిన కేసీఆర్

 హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీ సర్దార్ పటేల్‌నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సైగ్నస్ గ్యాస్ట్రోఎంటరాలజీ హస్పిటల్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఆసుపత్రి చైర్మన్ శ్రీవేణు, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే లు మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, కూకట్‌పల్లి టీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జి గొట్టిముక్కల పద్మారావు తదితరులు పాల్గొన్నారు.
 
 

>
మరిన్ని వార్తలు