పాస్‌ పుస్తకం రాలేదని రైతు ఆత్మహత్య

25 Nov, 2019 04:20 IST|Sakshi

మర్పల్లి: విరాసత్‌ పూర్తయి ప్రొసీడింగ్‌ కాపీ ఇచ్చినా డిజిటల్‌ పాస్‌ పుస్తకం రాకపోవడంతో తనకు బ్యాంక్‌ రుణం, రైతుబంధు సాయం దక్కడం లేదనే మనస్తాపంతో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలం పెద్దాపూర్‌కు చెందిన కావలి మణెమ్మ పేరుపై ఎకరం 25 గుంటల భూమి ఉంది. గతేడాది ఆమె మృతి చెందడంతో తన ఇద్దరు కుమారులు మొగులయ్య, సామేల్‌ (50) చెరో 30 గుంటల భూమిని సాగు చేసుకుంటున్నారు. ఈ భూమి విరాసత్‌ ప్రొసీడింగ్‌ కాపీ వచ్చినా.. కొత్త పాస్‌బుక్‌ రాలేదు. దీంతో సామేల్‌ బ్యాంక్‌ రుణం, రైతుబంధు సాయం పొందలేకపోయాడు. దీనిపై ఐదు రోజుల కిందట సా మేల్‌ రెవెన్యూ కార్యాలయానికి పురుగుల మందు డబ్బాతో వచ్చి ఆందోళనకు దిగాడు. అధికారులు ఆయనను సముదాయించి ఇంటికి పంపారు. ఈ క్రమంలో కొత్త పాస్‌ పుస్తకం లేదు.. బ్యాంకు రుణం రాదు.. చేసిన అప్పులు తీరవు అంటూ మనోవేదనకు గురైన సామేల్‌ ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో పురుగు మందు తాగాడు. మెరుగైన వైద్యానికి సంగారెడ్డి తీసుకెళ్తుండగా మృతిచెందాడు. అతనికి రూ.1.2 లక్షల అప్పు ఉందని కుటుంబసభ్యులు తెలిపారు.

మరిన్ని వార్తలు