నో క్యాష్‌ బోర్డు కనిపించొద్దు

13 Jul, 2017 03:02 IST|Sakshi
నో క్యాష్‌ బోర్డు కనిపించొద్దు

బ్యాంకర్ల సమావేశంలో రైతు సంఘాలు

సాక్షి, హైదరాబాద్‌: ‘డీమోనిటైజేషన్‌ ప్రక్రియ తర్వాత చాలా బ్యాంకు శాఖల్లో నో క్యాష్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. దాంతో ఎంతో దూరం నుంచి వచ్చిన ఖాతాదారులు ఖాళీ చేతులతో వెనుదిరుగుతున్నారు. ముఖ్యంగా రైతులు పంట రుణాలకోసం వస్తే వారికి ఈ పరిస్థితి గుదిబండగా మారుతోంది. ఇకపై ఇలా జరగడానికి వీల్లేదు. ఒక్క శాఖలోనూ ‘నో క్యాష్‌’ బోర్డు కనిపించొద్దు’ అని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అధ్యక్షతన బుధవారం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ), రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ), వివిధ రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బ్యాంకుల్లో నెలకొన్న పరిస్థితులపై రైతు సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మూడో విడత రుణ మాఫీ చేసినప్పటికీ రైతులకు నిధులు ఇవ్వడం లేదని, ప్రస్తుతం నాల్గో విడత మాఫీ సైతం జరుగుతోందన్నారు.

 గ్రామీణ బ్యాంకుల్లో రోజుల తరబడి నగదు లేకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. దీంతో దత్తాత్రేయ జోక్యం చేసుకుంటూ బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేశారు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ఉన్న రైతుకు తప్పనిసరిగా రూ.లక్ష వరకు నగదు ఇవ్వాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. బ్యాంకు శాఖల వారీగా రైతులకు ఇచ్చిన నగదు వివరాలను ప్రదర్శించాలని ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లో బ్యాంకర్లతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి పరిస్థితిని సమీక్షించాలన్నారు. వారానికోసారి రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశమై రైతుల సమస్యలను తెలుసుకోవాలన్నారు. పంటరుణాలపై రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర ఆర్థిక శాఖకు వివరించినట్లు దత్తాత్రేయ చెప్పారు. జూన్‌ నెలాఖరు నాటికి రూ.9వేల కోట్లు బ్యాంకులకు అందించామని, అదేవిధంగా జూలై మొదటివారం నాటికి రూ.2,600 కోట్లు ఇచ్చినట్లు వివరించారు. రెండ్రోజుల్లో మరో 2వేల కోట్లు రాష్ట్రంలోని బ్యాంకులకు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు