ప్రాణం తీసిన ‘పరిహారం’ 

27 Sep, 2017 03:25 IST|Sakshi

ఓపెన్‌కాస్ట్‌ విస్తరణ కోసం భూమిని కోల్పోయిన రైతు 

మనోవేదనతో మృతి

సత్తుపల్లి: సింగరేణి సంస్థ జేవీఆర్‌ ఓపెన్‌కాస్ట్‌ విస్తరణ పేరుతో ఏడాదిన్నర క్రితం రైతుల భూములు తీసుకుంది. పరిహారం మాత్రం నేటికీ అందించలేదు. మంత్రులను, అధికారులను కలసి వేడుకున్నా ఫలితం లేదు. ఇక డబ్బులు ఎప్పుడు వస్తాయోనని మానసిక క్షోభకు గురైన ఓ రైతు బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మంగళవారం మృతిచెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కొమ్మేపల్లిలో చోటుచేసుకుంది. కొమ్మేపల్లిలో జేవీఆర్‌ ఓపెన్‌ కాస్టు విస్తరణలో భాగంగా గ్రామ రెవెన్యూ పరిధిలోని పట్టా భూమి 489 ఎకరాలు తీసుకున్నారు. దీనికి పరిహారం కూడా మంజూరైంది. అయితే పలువురు రైతులకు అందలేదు. ఏడాదిన్నర క్రితం సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేతుల మీదుగా ఎకరానికి రూ.10.95 లక్షల చొప్పున 70 ఎకరా లకు లాంఛనంగా పరిహారం అందించారు.

కాగా, అవార్డు ఎంక్వైరీ విధానం సరిగా లేదంటూ కొందరు కోర్టును ఆశ్రయించడంతో పరిహారం నిలిచిపోయింది. నాటి నుంచి 419 ఎకరాలకు సంబంధించి 200 మందికిపైగా రైతులు మానసిక క్షోభకు గురవుతున్నారు. ఈ క్రమంలో బాధితుల్లో ఒకరైన పెద్దిరెడ్డి మహేశ్‌(48) కుటుంబానికి 11 ఎకరాల భూమి ఉంది. అన్నదమ్ముల వాటాపోను మహేశ్‌కు రెండెకరాలు రాగా, సింగరేణి లాగేసుకుంది. అయితే ఎకరానికి రూ.10.95 లక్షల చొప్పున వస్తాయనే నమ్మకంతో అప్పుతెచ్చి కూతురు పెళ్లి చేశాడు. వాటికి వడ్డీలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మనోవేదనకు గురై బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మృతిచెందాడు. కాగా, ఈ కారణంతో ఇప్పటికే ఆరేడుగురు మృత్యువాత పడ్డారని నిర్వాసితులు విలపిస్తున్నారు. మహేశ్‌ మృతదేహాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సందర్శించి నివాళులర్పించారు.

మరిన్ని వార్తలు