పత్తి బస్తానే.. పాడె కట్టెనా..

3 Feb, 2015 01:28 IST|Sakshi
పత్తి బస్తానే.. పాడె కట్టెనా..

ఖమ్మం: కలిసిరాని కాలంతో అంతంత మాత్రమే పత్తి పండింది.. ఆ కొంచెం దిగుబడినీ చేతబట్టుకొని వస్తే మార్కెట్లో ధర వెక్కిరించింది.. ఇక ఏ దిక్కూలేక వచ్చినకాడికి అమ్ముకునేందుకు సిద్ధమైనా.. అప్పులు కళ్లముందు కదలాడాయి. గుండెను పిండేస్తున్న ఆ ఆందోళనతో.. అక్కడే.. ఆరుగాలం చెమటోడ్చి పండించిన ఆ పత్తిబస్తాలపైనే కుప్పకూలిపోయాడు.. ప్రాణాలు వదిలేశాడు.. పత్తి అమ్మేం దుకు సోమవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వచ్చిన రైతు గొర్రెముచ్చు వెంకటి (58) వ్యథ ఇది.
 ఖమ్మం జిల్లా చింతకాని మండలం నేరెడ గ్రామానికి చెందిన వెంకటికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన తనకున్న రెండెకరాల భూమితో పాటు మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. పెట్టుబడి కోసం మూడు లక్షల రూపాయలు అప్పు తెచ్చాడు. వర్షాభావ పరిస్థితుల కారణంగా పంట దిగుబడి తగ్గిపోయింది. వచ్చినకాడికి తీసి దాచిన 10 బస్తాల పత్తిని అమ్మేందుకు సోమవారం ఖమ్మంలోని వ్యవసాయ మార్కెట్‌కు వచ్చాడు. సీసీఐ కొనుగోళ్లు నిలిపివేయడంతో ప్రైవేటు వ్యాపారులు పత్తి ధర తగ్గించారు. వెంకటి తెచ్చిన పత్తి క్వింటాల్‌కు రూ. 3,600 చొప్పున మాత్రమే ఇస్తామన్నారు. దీంతో ఆందోళన పడ్డ వెంకటి.. చివరికి వచ్చినకాడికి అమ్ముకునేందుకు సిద్ధమయ్యాడు. గుండెను పిండేస్తున్న ఆందోళనతో... పత్తిని తూకం వేయిస్తుండగానే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన తోటి రైతులు 108కు సమాచారం ఇచ్చారు. కొద్దిసేపటికే అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది వెంకటి గుండెపోటుతో మరణించాడని నిర్ధారించారు. వెంకటి హఠాన్మరణంతో ఆయన కుటుంబసభ్యుల ఆవేదనకు అంతులేదు. గతేడు చేసిన అప్పులే తీరలేదని, ఈసారి సాగు కోసం మరిన్ని అప్పులు చేయాల్సి వచ్చిందని చెప్పారు. కాగా.. వెంకటి కుటుంబానికి రైతు బీమా పథకం కింద రూ. లక్ష చెల్లిస్తామని మార్కెట్ అధికారులు ప్రకటించారు. అంత్యక్రియల కోసం రూ. 30 వేలు ఇస్తామన్నారు. కాగా, వెంకటి కుటుంబానికి ప్రభుత్వం రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని న్యూడెమోక్రసీ, రైతుకూలీ సంఘం డిమాండ్ చేశాయి. గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమవడంతోనే మరణాలు చోటు చేసుకుంటున్నాయని మండిపడ్డాయి.
 మరో ఇద్దరు రైతులు బలి!
 ఓదెల/ములుగు: అప్పుల బాధతో మరో ఇద్దరు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. కరీంనగర్ జిల్లా ఓదెల మండలం ఇందుర్తికి చెందిన తాడూరి రవీందర్‌రెడ్డి(45), వరంగల్ జిల్లా ములుగు మండలం బరిగలోనిపల్లికి చెందిన పంచగిరి భిక్షపతి(55) ఆత్మహత్య చేసుకున్నారు.

మరిన్ని వార్తలు