శరత్‌ తప్పుదోవ పట్టించాడు

29 Mar, 2019 00:44 IST|Sakshi

యువరైతు మాటలు అబద్ధం

మాకు రైతుబంధు డబ్బులు రాలేదు 

కొండపల్లి శంకరమ్మ కూతురు జ్యోతి

నెన్నెల (బెల్లంపల్లి): మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందులపల్లికి చెందిన యువ రైతు కొండపల్లి శరత్‌ సీఎం కేసీఆర్‌కు అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించాడని కొండపల్లి శంకరమ్మ కూతురు జ్యోతి ఆరోపిం చారు. మాభూమిని వీఆర్వో కరుణాకర్‌ తమకు తెలియకుండా కొండపల్లి శంకరమ్మ పేరిట పట్టా చేశారని శరత్‌ ఫేస్‌బుక్‌ పేజీలో లైవ్‌ వీడియో ఉంచడం, సీఎం స్పందించి రైతుతో మాట్లాడి సమస్య పరిష్కరించిన విషయం తెలిసిందే. ఈ విషయమై జ్యోతి మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో విలేకరులతో మాట్లా డారు. భూవివాదంపై ఇరువర్గాలతో చర్చించి సమన్యాయం చేయాల్సి ఉండగా సీఎం ఏకపక్ష ఆదేశాలతో అధికారులు తమకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు.  తాము హైదరాబాద్‌లో ఉండడం లేదని, రైతుబంధు డబ్బులు తీసుకోలేదని స్పష్టం చేశారు. ఉద్యోగ రీత్యా శ్రీరాంపూర్‌లో నివసిస్తున్నామని తెలిపారు. ఫోన్‌లో భూమి ఎవరి పేరు మీద పట్టా మార్పిడి అయిందన్న కేసీఆర్‌.. పట్టా అయిన వారు మీకు ఏమవుతారని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. కొండపల్లి శంకరయ్య సాగు చేస్తున్న 7.01 ఎకరాల భూమి, తామం తా సాగు చేస్తున్న 2.25 ఎకరాల భూమి ఉమ్మడి ఆస్తి అని, అందరికీ సమానంగా పంచి తమకు న్యాయం చేయాలని జ్యోతి కోరింది.  ఈ విషయమై శరత్‌ స్పందిస్తూ.. 30 ఏళ్ల నుంచి సర్వే నం.271/1ఏ లో ఉన్న భూమిని తామే సాగు చేసుకుంటున్నామని, తమకు సొంత పట్టా ఉందని పేర్కొన్నాడు.  

అసలు జరిగింది ఇదీ 
సేత్వార్‌ రికార్డు ప్రకారం సర్వే నం.270 విస్తీర్ణం 2.25 ఎకరాల భూమికి కొండపల్లి రాజలింగు పట్టాదారు కాగా సర్వే నం.271 విస్తీర్ణం 8.1 ఎకరాల భూమికి కొండపల్లి మల్లయ్య తండ్రి చంద్రయ్య  పట్టాదారుగా ఉన్నాడు. మల్లయ్య మరణానంతరం అతని కుమారుడైన కొండపల్లి శంకరయ్యకు వారసత్వంగా 8.01 ఎకరాల భూమి పట్టా అయింది. అనంతరం శంకరయ్య  ఎకరం భూమిని ఇతరులకు విక్ర యించగా 7.01 ఎకరాల భూమి అతడి పేరుపై పట్టా, యాజమాన్య హక్కులు కొనసాగుతూ వచ్చాయి. భూప్రక్షాళనలో ఇట్టి భూమి అదే గ్రామానికి చెందిన కొండపల్లి శంకరమ్మ ఖాతాలోకి మార్చబడింది. ఇరువురి మధ్య తరచూ పంచాయితీలు నడుస్తూ వచ్చాయి.

పట్టా మార్చిన తహసీల్దార్‌ సస్పెన్షన్‌
బెల్లంపల్లి: సంచలనం సృష్టించిన భూపట్టా మార్పిడి కేసులో తహసీల్దార్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.  నెన్నెల మండల తహసీల్దార్‌గా పనిచేసి బదిలీపై వెళ్లిన రాజలింగును సస్పెండ్‌ చేస్తూ గురువారం చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సీసీఎల్‌ఏ) నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాజలింగు 2018 జనవరి 26న ఉద్యోగ బాధ్యతలు స్వీకరించా రు. భూ రికార్డుల ప్రక్షాళనలో నందులపల్లికి చెందిన కొండపల్లి శంకరయ్య పేరు మీద ఉన్న సర్వే నంబర్‌ 271/1ఎలోని 7.01 ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన కొండపల్లి శం కరమ్మ పేరుమీద పట్టా మార్పిడి జరిగింది. వీఆర్వో కరుణాకర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ పెద్దిరాజు కుమ్మక్కై పట్టా బదిలీ చేశారు. కలెక్టర్‌ విచారణ చేపట్టి తక్షణమే ఆర్‌ఐ, వీఆర్వోను సస్పెండ్‌ చేయగా తాజాగా తహసీల్దార్‌పై వేటు వేశారు.  ప్రస్తుతం రాజలింగు కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం తహసీల్దార్‌గా పని చేస్తున్నారు. 

కోర్టులో  తేల్చుకోండి: కలెక్టర్‌
2015 సంవత్సరం వరకు కొండపల్లి శంకరయ్య పేరు మీద భూమి ఉందని మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ భారతి హోళీకేరి అన్నారు. వీఆర్వో చేసిన తప్పిదం వల్ల కొండపల్లి శంకరమ్మ పేరు మీద మారిందని చెప్పారు. దీనిని ఈ నెల 25న సవరించేందుకు ఏర్పాట్లు చేశారని. కానీ ధరణి వెబ్‌సైట్‌ ఇబ్బందుల కారణంగా కాలేదన్నారు. సీఎం ఆదేశాలతో మరోసారి 27న మార్చినట్లు తెలిపారు. గతంలో భూమి పేరు మీద ఉంటే కోర్టులో అప్పీల్‌ చేసుకోవాలి. కోర్టు ఆదేశాల ప్రకారం ఎవరి పేరు మీద వస్తే వారి పేరు మీద మార్చుతామని చెప్పారు. లేదా కుటుంబ సభ్యులంతా కలసి వారసత్వం, వీరాసత్‌ చేసుకోండని సలహా ఇచ్చారు. గతంలో రైతుబంధు చెక్కు ఎవరికీ ఇవ్వలేదని, రైతుబంధు చెక్కు, పాసుపుస్తకం కొండపల్లి శంకరమ్మకు ఇచ్చినట్లు శరత్‌ తప్పుడు సమచారం ఇచ్చాడని కలెక్టర్‌ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు