కుప్ప నూర్చే క్రమంలో.. ఆగిన రైతన్న ఊపిరి!

29 Apr, 2020 10:42 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి: జిల్లాలోని బీబీపేట్ మండలం యాడారంలో విషాదం చోటుచేసుకుంది. చేతికందిన పంట అకాల వర్షంలో తడిసిపోవడంతో ఓ అన్నదాత ఊపిరి ఆగింది. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద చాకలి దేవరాజు (45) అనే రైతు బుధవారం ఉదయం హఠాన్మరణం చెందాడు. అకాల వర్షం నుంచి తన ధాన్యాన్ని కాపాడుకోవాలనే తాపత్రాయంలో ధాన్యాన్ని కుప్ప చేస్తుండగా ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచాడు.
(చదవండి: 3 లక్షల జన్‌ధన్‌ ఖాతాల నుంచి డబ్బులు వెనక్కి)

తాజా ఘటనతో కామారెడ్డి జిల్లాలో ధాన్యం రైతుల మృతి రెండుకు చేరింది. ఇప్పటికే లింగంపేట మండలం పోల్కంపేట ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద తడిసిన ధాన్యం ఆరబెట్టే క్రమంలో భూమయ్య అనే రైతు గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇప్పటికైనా ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. రెండు వారాలుగా అకాల వర్షాలు, ఈదురు గాలులు ధాన్యం రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యేంతవరకు రైతులకు సమస్యలు తప్పేలా లేవు.
(చదవండి: మన సంస్కృతి.. ప్రపంచ దేశాలకు దిక్సూచి)

మరిన్ని వార్తలు