రైతు సమస్యలపై పట్టింపేది?

15 May, 2015 01:43 IST|Sakshi

- రాష్ట్ర ప్రభుత్వానిది మొసలి కన్నీరు
- రాహుల్ రాజకీయం చేస్తున్నాడు
- బీజేపీ జిల్లా ఇన్‌చార్జి మురళీధర్‌గౌడ్
- కలెక్టరేట్ ఎదుట ధర్నా
ఆదిలాబాద్ రిమ్స్ :
రైతు సమస్యలపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం మొసలి కన్నీరు కారుస్తోందని, రైతాంగాన్ని పట్టించుకోవడం లేదని బీజేపీ జిల్లా ఇన్‌చార్జి మురళీధర్‌గౌడ్ విమర్శించారు. బీజేపీ కిసాన్‌మోర్చ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే మాటమార్చిందని దుయ్యబట్టారు. ఓ వైపు అప్పులు చెల్లించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే రుణాలు విడతల వారీ గా మాఫీ చేయడం సరికాదని అన్నారు. బ్యాంకు బకాయిలను ఒకేసారి మాఫీ చేసి ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ ఏడాది జిల్లాలో కరువు ఏర్పడినా కేంద్రానికి కరువు నివేదిక పంపకపోవడంతో రైతులకు కరువు సహాయం కూడా అందలేదని పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. ఇప్పటివరకు అధికార పార్టీ నాయకులు ఒక్కరు కూడా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించలేదని ఎద్దేవా చేశారు. వాతావరణం అనుకూలించక పం టలు సరిగా పండలేదని, ఆదుకోవాల్సిన ప్రభుత్వం కూడా గిట్టుబాటు ధర కల్పించలేదని తెలిపారు. ఈ ఏడాది కనీసం విత్తనాలు కొనుగోలు చేసే పరిస్థితిలో రైతులు లేనందున 90 శాతం సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేయాలని కోరారు. జిల్లాలో రైతుయాత్ర చేపడుతున్న రాహుల్‌గాంధీ రైతు రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వేల ఎకరాలు కార్పొరేట్ వ్యాపారులకు అప్పగించిన కాంగ్రెస్ పార్టీకి బీజేపీని విమర్శించే హక్కు లేదని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ల పాలన లో వ్యవసాయ అభివృద్ధి కుంటుపడిందని ఎద్దేవా చేశా రు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రధాన మం త్రి నరేంద్రమోగీ కృషి చేస్తున్నారని తెలిపారు. బీజేపీ కిసాన్ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాయల శంకర్, ఉపాధ్యక్షురాలు సుహాసిని, కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షుడు దీపక్‌సింగ్ షెకావత్, ఉపాధ్యక్షుడు మడావి రాజు, నాయకులు రఘుపతి, జోగు రవి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు