యూరియా కోసం వెళ్లి  రైతు మృతి!

6 Sep, 2019 02:22 IST|Sakshi

క్యూలో నిలబడి గుండెపోటుతో 

మరణించిన రైతన్న..

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో ఘటన 

దుబ్బాక టౌన్‌: యూరియా బస్తాల కోసం లైన్లో నిలబడ్డ ఓ రైతు గురువారం ఆకస్మికంగా గుండె పోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్‌ఐ సుభాష్‌గౌడ్, బాధిత రైతు కుటుంబ సభ్యుల కథనం ప్రకారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అచ్చుమాయపల్లికి చెందిన రైతు చేర్వాపురం ఎల్లయ్య (69)కు రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. దీనికితోడు మరో రెండెకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు.

ఈ నాలుగు ఎకరాల్లో వరి, మొక్క జొన్న, పత్తి పంటలు సాగు చేశాడు. పంటలకు అవసరమైన యూరియా ఎరువు కోసం మూడు రోజుల నుంచి ఎల్లయ్య దుబ్బాకకు వస్తున్నా దొరకలేదు. గురువారం వ్యవసాయ సహకార సంఘం వద్దకు యూరియా లారీ వచ్చిం దని తెలవడంతో ఉదయం తన భార్య లచ్చమ్మతో కలసి అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే యూరియా కోసం వందల మంది రైతులు లైన్‌లో నిలుచున్నారు. దీంతో ఎల్లయ్య లైన్‌లో నిలబడగా ఆయన భార్య లచ్చమ్మ సైతం మహిళా రైతుల లైన్‌లో నిలుచుంది.

సుమారు గంటసేపు లైన్‌లో నిలుచున్న ఎల్లయ్య, ఒక్కసారిగా సొమ్ముసిల్లి పడిపోయాడు. దీంతో అక్కడ ఉన్న రైతులు ఎల్లయ్యను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గ మధ్యలోనే మృతి చెందాడు. ఆసుపత్రిలో ఎల్లయ్యను పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో మృతి చెందాడని నిర్ధారించారు. ఎల్లయ్య భార్య లచ్చమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దుబ్బాక పోలీసులు కేసు నమోదు చేశారు.

నలుగురు కూతుళ్లు..
మృతిచెందిన రైతు ఎల్లయ్యకు నలుగురు కూతుళ్లు. వీరిలో పెద్ద కూతురు శ్యామల భర్త ఏడేళ్ల క్రితమే మరణించడంతో ఆమె కుటుంబాన్ని కూడా ఎల్లయ్యనే పోషిస్తున్నాడు. రెండో కూతురు నర్సవ్వకు వివాహం అయింది. మూడో కూతురు రేణుక వికలాంగురాలు. చిన్న కూతురు మమతకు నాలుగు నెలల క్రితమే అప్పుచేసి వివాహం చేశాడు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా