అప్పులబాధతో రైతు ఆత్మహత్య

22 May, 2015 23:29 IST|Sakshi

మెదక్ టౌన్ : అప్పులబాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండల పరిధిలోని రాజిపేట గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన రైతు సాయిలు (55) తనకున్న మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. సాగు భూమిలో నీటి వసతి కోసం ఇటీవల రెండు బోర్లు వేయించాడు. ఇందు కోసం రూ. 1.50 లక్షలు అప్పు చేశాడు. అయినప్పటికీ చుక్కనీరు పడలేదు. రబీ పంట పూర్తిగా ఎండిపోతుండడంతో దాన్ని చూసి తట్టుకోలేక తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.

చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక శుక్రవారం పొలం వద్ద వెళ్లి పురుగుల మందు తాగాడు. విషయం గమనించిన ఇరుగుపొరుగు పొలాల రైతులు సాయిలును వెంటనే మెదక్ ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు. మృతునికి భార్య నర్సమ్మ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ మేరకు మెదక్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

మరిన్ని వార్తలు