సీఎం క్యాంపు కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్యాయత్నం 

11 Apr, 2018 02:17 IST|Sakshi
చికిత్స పొందుతున్న సైదులు

హైదరాబాద్‌: అప్పుల బాధ తాళలేక ఓ యువ రైతు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ముందు మంగళవారం ఆత్మహత్యకు యత్నించాడు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గంపల తిరుమలగిరికి చెందిన సైదులు(24) కౌలురైతు. గ్రామంలో 11 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వరి పంట వేశాడు. సోదరి వివాహం, పంట పెట్టుబడి నిమిత్తం సుమారు రూ.9 లక్షల వరకు అప్పులు చేశాడు. బోర్లు ఎండిపోవడంతో నీరు రాక పంట మొత్తం పోయింది. అప్పుల వారి వేధింపులు ఎక్కువ కావడంతో తన బాధను ముఖ్యమంత్రికి చెప్పుకుని సాయం కోరేందుకు క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చాడు. లోనికి వెళ్లేందుకు యత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.

దీంతో తీవ్ర మనోవేదనకు గురైన సైదులు తన వెంట తెచ్చుకున్న క్రిమిసంహారక మందు తాగాడు. అక్కడే నురగలు కక్కుకుని పడిపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది గమనించి అతన్ని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, కలెక్టర్‌ ఆదేశాల మేరకు సైదులు వరి పొలాన్ని, ఇళ్లను వ్యవసాయ, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. తుది నివేదికను కలెక్టర్‌కు అందించనున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు