నా భూమి దక్కదేమో! 

27 Feb, 2018 02:50 IST|Sakshi
ఆర్డీఓ ఎదుట పురుగుల మందు డబ్బాతో రైతు ఆదిరెడ్డి

రికార్డుల్లో భూమి సరిచేయడంలేదంటూ రైతు ఆత్మహత్యాయత్నం 

శాయంపేట (భూపాలపల్లి): వారసత్వంగా వచ్చిన భూమిని రికార్డుల్లో నమోదు చేయడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఓ రైతు ఆర్డీఓ ఎదుటే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఘటన సోమవారం వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట తహసీల్దార్‌ కార్యాలయంలో చోటుచేసుకుంది. మండలంలోని కొత్తగట్టు సింగారం 114 సర్వే నంబరులో కర్రు ఆదిరెడ్డి వారసత్వంగా తండ్రి నుంచి పొందిన 2.21 ఎకరాల భూమి ఉంది. 2008 వరకు రికార్డుల్లో వివరాలు సరిగ్గానే ఉండగా.. 2010 తరువాత 1.31 ఎకరాలు మాత్రమే ఉంది. దీంతో బాధిత రైతు ఆరు నెలలుగా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందనలేదు. ఇదే విషయమై సోమవారం ఆదిరెడ్డి తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చాడు.

ఆ సమయంలో డబుల్‌ బెడ్రూం నిర్మాణ పనులను పరిశీలించడానికి ఆర్డీఓ మహేందర్‌జీ వచ్చారు. ఆదిరెడ్డి తన సమస్యను ఆర్డీఓ దృష్టికి తీసుకొచ్చాడు. వెంటనే సంచిలో తెచ్చుకున్న పురుగుల మందు డబ్బా తీసి తాగేందుకు యత్నించాడు. గమనించిన ఆర్డీఓ డబ్బాను లాక్కుని వారించాడు. రెండు రోజుల్లో విచారణ చేపట్టి సమస్య పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఒకవేళ అధికారులు రాకుంటే తనకు నేరుగా ఫోన్‌ చేయాలని తన నంబర్‌ ఇవ్వడంతో బాధిత రైతు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం సంబంధిత అధికారులపై ఆర్డీఓ మండిపడ్డారు. విచారణ పూర్తి చేసి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు.   

మరిన్ని వార్తలు