వేరొకరికి పట్టా చేశారని..

20 Nov, 2019 03:15 IST|Sakshi
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓంశంకర్‌  

పెట్రోల్‌ పోసుకుని దివ్యాంగుడి ఆత్మహత్యాయత్నం

భూ వివాదం కోర్టులో ఉంది: తహసీల్దార్‌ 

దంతాలపల్లి : తన భూమిని వేరొకరికి పట్టా చేశారని ఆరోపిస్తూ మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండల తహసీల్దార్‌ కార్యాలయం ముందు ఓ దివ్యాంగ యువకుడు మంగళవారం పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మండలంలోని కుమ్మరికుంట్ల గ్రామానికి చెందిన ఐనాల ఉప్పలయ్య 2012లో తండ వెంకటయ్య నుంచి ఎనిమిది ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. అయితే, డబ్బు పూర్తి స్థాయిలో చెల్లించకపోగా రిజిస్ట్రేషన్‌ కూడా చేసుకోలేదు. కాగా, వెంకటయ్యతో పాటు ఆయన కుమారుడు విష్ణు కూడా వేర్వేరుగా మరణించారు. అనంతరం నెల రోజులకు ఐనాల ఉప్పలయ్య వెళ్లి విష్ణు భార్య సరితను కలసి తనకు అమ్మిన భూమి రిజిస్ట్రేషన్‌ చేయాలని కోరాడు. దీనికి సరిత రశీదులు సరిగా లేవని, అవి ఫోర్జరీవని చెప్పడమే కాకుండా అదనంగా డబ్బు చెల్లించాలని చెబితే ఉప్పలయ్య నిరాకరించాడు.

కొన్ని రోజుల అనంతరం ఫోర్జరీ సంతకాలతో ఉప్పలయ్య సాదాబైనామాకు దరఖాస్తు చేసుకుంటే సరిత అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రెవెన్యూ అధికారులు పరిశీలించి సరితకు ఎనిమిది ఎకరాలతో పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేశారు. ఈ క్రమంలో ఐనాల ఉప్పలయ్య మరణించగా ఆయన కుమారుడు, దివ్యాంగుడైన ఐనాల ఓంశంకర్‌.. భూమి మీదకు వెళ్తే సరిత కోర్టు నుంచి ఇంజక్షన్‌ ఆర్డర్‌ తెచ్చుకుంది. ఈ విషయమై ఇరు కుటుంబాల మధ్య వివాదాలు తలెత్తి పోలీస్‌ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. తాజాగా సరిత తన భూమిని వేరొకరికి విక్రయించడంతో ఓంశంకర్‌ తన భూమిని అధికారులు వేరొకరికి పట్టా చేశారని ఆరోపిస్తూ మంగళవారం తహసీల్దార్‌ గౌరీశంకర్‌తో వాగ్వాదానికి దిగాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను శరీరంపై పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎస్సై బానోతు వెంకన్న.. ఓంశంకర్‌ను వారించారు. ఈ విషయమై దంతాలపల్లి తహసీల్దార్‌ గౌరీశంకర్‌ మాట్లాడుతూ కోర్టు కేసులో ఉండటంతో భూ సమస్యను తాము పరిష్కరించలేమని చెప్పామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు