దా‘రుణాలు’

1 Nov, 2014 02:02 IST|Sakshi
దా‘రుణాలు’

తీవ్ర వర్షాభావం...భూగర్భ జలాలు అంతంతమాత్రం..పంటలన్నీ కళ్లముందే ఎండిపోయాయి. పెట్టుబడులకోసం, బోర్లు వేసేందుకు చేసిన అప్పులు గుండెలపై కుంపటిలా మారాయి..ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియని రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా శుక్రవారం జిల్లాలో ఇద్దరు రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. సిద్దిపేట మండలం బూర్గుపల్లి గ్రామానికి చెందిన మల్లయ్య (45) పురుగుల మందు తాగి తనువు చాలించగా,  రామాయంపేట మండలం కోమటిపల్లి గిరిజన తండాకు చెందిన బధావత్ మోతీలాల్ (40) విష గుళికలు
 మింగి ప్రాణం తీసుకున్నాడు.
 
ఇద్దరు అన్నదాతల బలవన్మరణం
* అప్పులబాధలే కారణం
* బూర్గుపల్లి, కోమటిపల్లి గిరిజనతండాలలో విషాదం

సిద్దిపేట మండలం బూర్గుపల్లి గ్రామానికి చెందిన బోదాస్ మల్లయ్య (45) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తనకున్న మూడెకరాలలో రెండు ఎకరాలు మొక్కజొన్న పంటను సాగు చేశాడు. అయితే మొలకలు రాకపోవడంతో మరో సారి మొక్కజొన్న తెచ్చి సాగు చేశాడు. దీంతో పాటు ఉన్న మరో ఎకరం పొలంలో వరిని సాగు చేశాడు. అయితే ఉన్న బోరులో నీరు సక్రమంగా రాకపోవడంతో మొక్కజొన్న, వరి పంటలు ఎండిపోయాయి. ఈ క్రమంలో పంట పెట్టుబడులు, కుటుంబ అవసరాలకు సుమారు రూ. 1.50 లక్షలు అప్పు చేశాడు. అయితే పంటలు చేతికి అందే పరిస్థితి లేకపోవడం, పెళ్లీడుకువచ్చిన కుమార్తె ఉండడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.

దీంతో శుక్రవారం ఉదయం మల్లయ్య తన వ్యవసాయం పొలం వద్దకు వెళ్లి పురుగు మంది తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన పొరుగు పొలాల రైతులు అతడిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయినప్పటికి మల్లయ్య మరణించాడు. మృతునికి భార్య లక్ష్మితో పాటు పెళ్లిడుకొచ్చిన కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ బాబురావు, ఉప సర్పంచ్ రామరాజులు కోరారు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్, ఏఎస్‌ఐ వెంకటయ్య సిబ్బందితో గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
 
మరో ఘటనలో.. రామాయంపేట పంచాయితీ కోమటిపల్లి గిరిజన తండాకు చెందిన బదావత్ మోతీలాల్ (40) తనకున్న రెండెకరాల భూమిలో మొక్కజొన్నతో పాటు వరి పంట వేశారు. అయితే వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోయాయి. వ్యవసాయ పొలంలో గతంలో తవ్విన రెండు బోర్లలోనూ నీరు పడలేదు. ఈ క్రమంలో పంట పెట్టుబడులు, కుటుంబ అవసరాలకు సుమారు రూ. 2లక్ష మేర  అప్పు చేశాడు. అయితే రుణదాతల నుంచి అప్పు తీర్చాలని ఒత్తిళ్లు రావడంతో కలత చెంది గురువారం రాత్రి పంట చేను వద్దకు వెళ్లి అక్కడ విష గుళికలు మింగాడు.

ఈ విషయం ఎవరికీ చెప్పకుండా ఇంట్లోకి వచ్చి పడుకున్నాడు. కడుపు మంటతో మోతీలాల్ అల్లాడుతుంటే కుటుంబ సభ్యులు అతడిని నార్సింగిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు భార్యలు లక్షి్ష్మ, విజయలక్ష్మితో పాటు ఆరేళ్ల లోపు ఇద్దరు పిల్లలున్నారు. వారికున్న ప్రభుత్వం మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు  విజ్ఞప్తి చేశారు. కాగా ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ ప్రవీణ్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు