రైతుకు చేయూత

11 Jul, 2014 00:32 IST|Sakshi
రైతుకు చేయూత

 సిద్దిపేట రూరల్: రైతుకు ఏ కష్టం వచ్చినా ఊరుకోబోమని మంత్రులు హరీష్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డిలు తెలిపారు. గురువారం వారు సిద్దిపేట ఎంపీడీఓ కార్యాలయంలో వ్యవసాయం, ఉద్యానవన, పశువైద్యం, మార్క్‌ఫెడ్ జిల్లా స్థాయి అధికారులతో  సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు, జిల్లాలో రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు, యంత్ర పరికరాలు అందుబాటులో ఉన్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా మొక్కజొన్న పంట సాగు వివరాలను జిల్లాలోని ప్రాంతాల వారీగా అడిగి తెలుసుకున్నారు.
 
 అనంతరం మంత్రులు పోచారం, హరీష్‌రావులు మాట్లాడుతూ, వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉండడం లేదని రైతుల నుంచి ఫిర్యాదులందుతున్నాయని, రానున్న రోజుల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వ్యవసాయశాఖ అధికారులంతా స్థానికంగా ఉంటూ సేవలను విస్తృత పరచాలన్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లోని ఎరువుల వ్యాపారులు ఎమ్మార్పీ కంటే అదనంగా డబ్బు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోందని, వెంటనే అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే గ్రామైక్య సంఘాలు, పీఏసీఎస్‌ల ద్వారా ఎరువుల విక్రయానికి చర్యలు తీసుకోవాలన్నారు.  
 
 ఇక సేంద్రియ ఎరువుల వినియోగంపై రైతులను చైతన్య పరచాల్సిన బాధ్యత కూడా వ్యవసాయశాఖ అధికారులపైనే ఉందన్నారు.  రైతులకు బిందుసేద్యం పరికరాలను 50 శాతం సబ్సిడీపై అందించాలని, జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అధికారులు సమన్వయంతో పని చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. జిల్లాలో పాడిపరిశ్రమ అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకుగాను పాడిపశువులను 50 శాతం సబ్సిడీపై రైతులకు అందజేయాలని సూచించారు.

>
మరిన్ని వార్తలు