పీఎం–కిసాన్‌పై రైతుల ఆగ్రహం

17 Feb, 2019 03:17 IST|Sakshi

అర్హులమైనా లబ్ధిదారుల జాబితాలో పేరు లేదంటూ ఫిర్యాదు

వ్యవసాయశాఖ కమిషనరేట్‌కు తరలివస్తున్న అన్నదాతలు

నిబంధనలు కఠినంగా ఉండటంతో తలెత్తుతున్న సమస్యలు

ఎస్‌బీఐలో వ్యవసాయశాఖ తరపున ఖాతా తెరవాలని కేంద్రం ఆదేశం

ఆ బ్యాంకు ఖాతా ద్వారానే రైతులకు చేరనున్న సొమ్ము  

సాక్షి, హైదరాబాద్‌: పీఎం–కిసాన్‌ పథకం లబ్ధిదారుల జాబితాలో తమ పేరు లేదంటూ వేలాది మంది రైతులు వ్యవసాయశాఖకు ఫిర్యాదు చేస్తున్నారు. గ్రామాల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవో) జాబితాలను ప్రదర్శిస్తుండటంతో వాటిల్లో తమ పేరు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం రైతుల కోసం పీఎం–కిసాన్‌ పథకాన్ని ఇటీవల ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆ పథకం కింద ఐదెకరాలలోపున్న రైతులకు నిబంధనల మేరకు ఏడాదికి రూ.6 వేలు సాయం చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. విడతకు రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో సాయం చేస్తారు. ఆ పథకం కింద సన్నచిన్నకారు రైతులు లబ్ధిపొందుతారు. అందుకు సంబంధించి అర్హులను గుర్తించే పనిలో రాష్ట్ర వ్యవసాయ శాఖ నిమగ్నమైంది. ప్రస్తుతం వ్యవసాయ శాఖ వద్ద ఉన్న లెక్కల ప్రకారం దాదాపు 26 లక్షల మంది సన్నచిన్నకారు రైతులకు అర్హత ఉండొచ్చని అంటున్నారు. వారి జాబితాలను గ్రామాల్లో ప్రదర్శిస్తున్నారు. అయితే అర్హులైనవారి పేర్లు కూడా జాబితాల్లో కనిపించడం లేదు. దీంతో వేలాది మంది రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు అనేకమంది వ్యవసాయశాఖ కమిషనరేట్‌కు తరలివస్తున్నారు.  

చేతులెత్తేస్తున్న అధికారులు... 
నల్లగొండ జిల్లాకు చెందిన యాదయ్యకు మూడున్నర ఎకరాల భూమి ఉంది. భూమి కూడా అతని పేరు మీదే ఉంది. కానీ పీఎం–కిసాన్‌ పథకంకోసం తయారు చేసిన జాబితాలో అతని పేరు కనిపించలేదు. అతను శనివారం వ్యవసాయశాఖ కమిషనరేట్‌కు వచ్చి తన పే రు ఎందుకు లేదని అధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే సిద్దిపేట జిల్లాకు చెందిన చంద్రయ్య అనే రైతుకు నాలుగుంబావు ఎకరా ల భూమి ఉంది. తన భార్య పేరు మీద రెండెకరాలు, తన పేరు మీద రెండుంబావు ఎకరాల భూమి ఉంది. నిబంధనల ప్రకారం అతను పీ ఎం–కిసాన్‌ పథకానికి అర్హుడు. కానీ అతని పే రు కూడా జాబితాలో లేదు. చంద్ర య్య కూడా వ్యవసాయశాఖ కమిషనరేట్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. అధికారులు తమ పే ర్లు నమోదు చేయకపోవడంపై రైతుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. రైతుల నుంచి ఫి ర్యాదులు వస్తుంటే ఏంచేయాలో అర్థంగాక అధికారులు చేతులెత్తేస్తున్నారు. తాము పరిశీలించి న్యాయం చేస్తామని రైతులను తిప్పి పంపు తున్నారు. ఇంత జరుగుతున్నా ఇప్పటివరకు వ్యవసాయశాఖ వర్గాలు ప్రత్యేకంగా ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేయలేదు. కేంద్రం ఫిర్యాదు విభాగం ఏర్పాటు చేయాలని చెప్పి నా అధికారులు పెద్దగా పట్టించుకోవడంలేదు. 

ఎస్‌బీఐ ద్వారా రైతులకు సొమ్ము 
కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని బ్యాంకుల ద్వారా రైతు ఖాతాల్లోకి పంపిస్తుంది. అందుకోసం రాష్ట్ర స్థాయిలో ఎస్‌బీఐ బ్యాంకులో ఖాతా తెరవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. వ్యవసాయశాఖ కమిషనర్‌ పేరుతో ఆ బ్యాంకు ఖాతా తెరుస్తారు. ఒకట్రెండు రోజుల్లో ఖాతా తెరిచే అవకాశముం దని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి.

అటవీ భూములపై హక్కులు ఉంటే అర్హులే 
అటవీ భూములు సాగు చేసుకునే గిరిజనులు, ఆదివాసీలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సాగు హక్కులు కల్పిస్తే, వారికి కూడా పీఎం కిసాన్‌ వర్తిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది. దేశవ్యాప్తంగా 8.6 శాతం గిరిజనులు ఉన్నారని, వారంతా కూడా చిన్న, సన్నకారు రైతులేనని అందులో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో ఆర్‌వోఎఫ్‌ఆర్‌ కింద రైతుబంధు పథకం ద్వారా లబ్ధిపొందిన కుటుంబాలు కూడా పీఎం కిసాన్‌ పథకం తో లబ్ధిపొందనున్నాయి. వారిలో ఐదెకరా ల కంటే తక్కువ భూమి కలిగిన రైతుకు టుంబాల సంఖ్య 73,056గా ఉంది. వీరందరికీ కూడా పీఎం కిసాన్‌ వర్తించనుంది.

మరిన్ని వార్తలు