కలవరిమాయె

28 Nov, 2014 03:42 IST|Sakshi

అప్పులెలా తీరుతాయి
సాగర్ కాలువ ఆయకట్టు భూములు మావి. రబీ వరికి సాగర్ నీరు విడుదల చేయమంటున్నారు. ఆరుతడి పంటలే వేసుకోవాలంటున్నారు. ఆరుతడి పంటలు వేస్తే మా అప్పులు తీరవు. ఖరీఫ్‌లో సాగుచేసిన మిర్చి, పత్తి పంటలు ఎండిపోయాయి. ఈ ఏడాది తీవ్ర నష్టాలు వస్తున్నాయి. అంతోఇంతో నష్టాలు పూడాలంటే వరి వేసుకోక తప్పదు. సాగర్ నిండా నీళ్లున్నా ఇవ్వకపోతే మేము ఏమి చేయాలి?       
- జింకల ఆంజనేయులు, నాగవరప్పాడు
 
సాక్షి, ఖమ్మం: జిల్లాలోని నాగార్జుసాగర్ ఆయకట్టుతో పాటు ఆయకట్టేతర ప్రాంతాల్లో రైతులకు రబీ రంది పట్టుకుంది. సాగర్ ఆయకట్టు పరిధిలోనూ రబీలో ఆరుతడి పంటలే వేసుకోవాలని ఇప్పటికే ఎన్నెస్పీ అధికారులు ప్రకటించడంతో వరిసాగు ప్రశ్నార్థకంగా మారింది. రబీలో మరింతగా విద్యుత్ కోతలు పెరగనుండడంతో బోరుబావులు కింద కూడా వరి సాగు చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నెస్పీ ఆయకట్టేతర ప్రాంతాల్లోని రైతుల్లోనూ ఆందోళన నెలకొంది.

జిల్లాలో ఈ ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితులు, విద్యుత్ కోతలతో రైతులు వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చితో పాటు పలు పంటలను సాగు చేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటల దిగుబడి బాగా తగ్గింది. సాగర్ ఆయకట్టు చివరి భూములకు నీరందక పంటలు ఎండిపోయాయి. రబీలో అన్ని పంటల సాగు చేసుకోవచ్చని రైతులు భావించారు. కానీ ఈ సీజన్‌లో వర్షాభావం, విద్యుత్ కోతల నేపథ్యంలో నీరు ఎక్కువగా అసరమయ్యే వరి సాగు చేయవద్దని, ఆరుతడి పంటలనే వేసుకోవాలని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. అయినా జిల్లాలో మాత్రం ఖరీఫ్ వరి కోతలు పూర్తి అయిన ప్రాంతాల్లో ఇప్పటికే వరి నాట్లు ప్రారంభమయ్యాయి.

ఈ రబీలో అన్ని పంటల సాధారణ విస్తీర్ణం 87,018 హెక్టార్లు కాగా 20,315 హెక్టార్లలో పంటలను రైతులు ఇప్పటికే సాగు చేశారు. వరి సాధారణ విస్తీర్ణం 36,481 హెక్టార్లకు 684 హెక్టార్లలో వరి నాట్లు పడ్డాయి. సాగర్ నిండా నీళ్లు ఉన్నాయని.. చివరి వరకు నీళ్లు వస్తాయనే ధీమాతో నేలకొండపల్లి, సత్తుపల్లి, మధిర, బోనకల్, ముదిగొండ ప్రాంతాల్లో రైతులు వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. గత రబీలో కూడా ఆరుతడి పంటలే వేసుకోవాలని అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత రైతుల ఆందోళనలతో పంట చేతికి వచ్చే వరకు సాగర్ నీళ్లు విడుదల చేశారు.

అయితే మధిర, బోనకల్, ఎర్రుపాలెం మండలాల్లో గతంలో చివరి ఆయకట్టు భూములకు నీరందక వరి ఎండిపోయింది. ఆరుతడి పంటలు వేసుకోవాలని ప్రతిసారీ అధికారులు ప్రకటనలకే పరిమితమవుతున్నారు తప్ప.. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో విసృ్తతంగా ప్రచారం చేయకపోవడంతో చివరకు రైతులు వరిసాగు చేస్తున్నారు. నీళ్లు లేక పంటలు ఎండిపోవడంతో అప్పుల పాలవుతున్నారు. ఈ రబీలో కూడా ఓవైపు వరి సాగుకు సిద్ధమవుతున్న రైతులు మరోవైపు చివరి వరకు నీళ్లు రాకపోతే పంట చేతికి అందదని అప్పుల ఊబి లో కూరుకపోతామనే ఆందోళనతో ఉన్నారు.

మెట్ట రైతుల ఆందోళన
చెరువులు, బోరుబావుల కింద వరి సాగు చేయాలనుకుంటున్న రైతులు ఆందోళనలో ఉన్నారు. కొద్ది మొత్తంలో సాగు చేద్దామనుకున్న ఖరీఫ్‌లోనే విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడిన రైతులు రబీలో భారీగా కోతలు తప్పవని అంచనా వేస్తున్నారు. ఆరుతడి పంటలు వేసినా అడపాదడపా తడులు ఇవ్వాలి కాబట్టి కరెంట్ ఎన్ని గంటలు వస్తుందో.. పంట ఎండిపోతే పరిస్థితి ఎంటనే సందిగ్ధంలో ఉన్నారు.  ఈశాన్య రైతుల పవనాల ప్రభావం జిల్లాలో అంతగా లేకపోవడంతో ఈ రబీలో ఆరుతడి పంటల సాగు పడిపోయింది. గత ఏడాది రబీలో జొన్న 1,239 హెక్టార్లలో సాగు చేశారు. ఈ సారి కేవలం 164 హెక్టార్లలోనే వేశారు. గతంలో మినుములు 4,083 హెక్టార్లలో సాగు చేస్తే ప్రస్తుతం 1,587 హెక్టారలోనే సాగు చేస్తున్నారు. రబీలో వర్షాలు లేకపోవడంతో ముందస్తుగానే రైతులు ఆరుతడి పంటల సాగునూ తగ్గించారు.

గణనీయంగా తగ్గిన సాగు విస్తీర్ణం
రబీలో 87,018 హెక్టార్లు సాగవుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనావేశారు. సీజన్ ప్రారంభమై నెలరోజులు గడిచినా ఇప్పటి వరకు కేవలం 20,315 హెక్టార్లలోనే పంటలు వేశారు. ఈ సీజన్‌లో మొక్కజొన్న అత్యధికంగా 4,539 హెక్టార్లు, అపరాలు 5,290 హెక్టార్లలో సాగు చేశారు. సాగర్ ఆయకట్టు పరిధిలో వరి నూర్పిడి మరో 15 రోజుల్లో పూర్తి కానుంది. వరి సాగుచేద్దామనుకుంటున్న రైతులు 303 హెక్టార్లలో వరి నార్లు పోశారు. ఆరుతడి పంటలు వేసుకోవాలన్న అధికారుల సూచనలను పెడచెవిన పెట్టారు.

నీళ్లు ఎలాగైనా వస్తాయన్న నమ్మకంతో వరి సాగుకే మొగ్గుచూపుతున్నారు. తీవ్ర వర్షాభావం, సాగర్ నీళ్లు రాకపోతే పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుందని ఓవైపు ఆందోళన చెందుతూనే...మరోవైపు వరి సాగు చేయకపోతే గిట్టుబాటు కాదని ఆ పంటవైపు మొగ్గుచూపుతున్నారు. ఖరీఫ్ వెతలతో రబీలో కలిసి వస్తుందనుకున్న రైతులను వర్షాభావం, విద్యుత్ కోతలు, సాగర్ ఆయకట్టులో ఆరుతడి పంటల ప్రకటనలతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు