సాగుకు సహకరించని 2014

27 Dec, 2014 01:04 IST|Sakshi

కాలగర్భంలో మరో ఏడాది గడిచిపోతోంది.. క్షణాలు గంటలై.. గంటలు రోజులై.. రోజులు నెలలై.. నెలలు సంవత్సరమై.. 2014కు కూడా బైబై చెప్పనున్నాం. గతం గతః అనుకుం టే.. ఆ గతంలోని తీపి, చేదు జ్ఞాపకాలెన్నో.. అందులోనూ ఈ ఏడాది రైతన్నకు కలిసిరాలేదు. ఆరంభంలోనే.. విత్తనాలు, ఎరువులు అందక, కరెంటు ‘కట్’కట, రుణాల కోసం రణం చేసినా.. చివరికి యెవుసం ఏడిపించింది. వ్యయప్రయాసాలకోర్చి సాగు చేసిన పంటలను వర్షాభావం కోలుకోకుండా చేసింది. వచ్చిన దిగుబడిని అమ్ముకుందామంటే ప్రభుత్వ ‘మద్దతు’ లేక.. దళారుల దందా తట్టుకోలేక.. చివరికి రైతన్న ‘చితి’కి పోయాడు.

ఆరుగాలం కష్టపడే అన్నదాతకు అడుగడుగునా అరిగోసే. దుక్కులు దున్నాలన్నా వేలకు వేలు ఖర్చులు. ఆ దుక్కులు తడవాలంటే ఆకాశం వైపు చూపులు. విత్తనాలు కొనాలంటే కల్తీ బాధలు. అవి విత్తాలంటే తట్టుకోలేని కూలి రేట్లు. రేట్లు పెట్టినా ఒక్కోసారి దొరకని కూలీలు. అక్కడితో ఆగకుండా.. విత్తిన విత్తనాలు మొలకెత్తక.. మొలకెత్తిన మొక్కలకు నీటి తడులు అందక.. వానలు పడక.. కరెంటు సరఫరాలు సరిపడా లేక.. ఇలా వేసిన పంట వేసినట్లుగానే ఎండిపోయి.. నష్టాలను మిగిల్చి.. అన్నదాతను కష్టాల కడలిలో ఉంచే వెళ్లిపోతోంది... 2014. ఈ ఏడాదంతే అన్నదాతకు కలిసిరాలేదు. జిల్లాలో గతేడాది అతివృష్టి తీవ్రంగా నష్టపరిస్తే ఈ ఏడాది అనావృష్టితో వ్యవసాయం కరువు కోరల్లో చిక్కుకుంది. ఖరీఫ్‌లో వర్షాలు కురవలేదు. పంటలు నిలవలేదు. నిలిచిన పంటలకు నీటి తడులు అందక చివరికి పశువులకు మేత అయ్యాయి. ఇక రబీ సాగు అన్న మాటే లేదు.
 
విత్తనాలు, ఎరువుల కోసం ఆందోళన
ప్రభుత్వం 33 శాతం రాయితీపై సోయా, వరి, ఇతర పప్పుధాన్యాల విత్తనాలు అందజేశారు. ఖరీఫ్ ఆరంభంలో జిల్లాకు 20 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు(450 గ్రాముల ప్యాకెట్) అవసరం కాగా, 17 లక్షల ప్యాకెట్లు మాత్రమే అందాయి. జూన్‌లో వర్షాలు కురువకపోవడంతో 10 లక్షల ప్యాకెట్లు మాత్రమే రైతులు కొనుగోలు చేశారు. రెండు నెలలు ఆలస్యంగా వర్షాలు కురవడంతో రెండు, మూడుసార్లు విత్తనాలు విత్తుకున్నారు. సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలతో విత్తుకోవడానికి విత్తనాలు లేక రైతులు ఇబ్బంది పడ్డారు. ఆలస్యంగా కురిసిన వర్షాలతో మొదట వేసుకున్న విత్తనం, ఎరువులు యూరియా, డీఏపీ, పొటాష్ వ ృథాగా పోయాయి. తిరిగి రెండోసారి విత్తుకునేందుకు విత్తనాలు, ఎరువులు దొరక ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా యూరియా, డీఏపీ దొరకక పలు మండలాల్లో రైతులు ఆందోళన బాటపట్టారు.
 
పంటకు నీరందని దైన్య స్థితి
జూలైలో మొదటిసారి వేసుకున్న విత్తనాలు మొలకెత్తలేదు. ఆగస్టు రెండో వారం నుంచి మరోసారి విత్తనాలు వేసుకున్నారు. మళ్లీ ఆశించిన వర్షాలు కురువలేదు. చిరుజల్లులతో మొలకెత్తిన విత్తనాలను కాపాడుకోవడానికి అన్నదాతలు పడరాని పాట్లు పడ్డారు. వర్షాల జాడలేకపోవడంతో నీరసించిన రైతన్న మొలకలు బతికించుకునేందుకు నీటిని అందివ్వడానికి దూర ప్రాంతాల నుంచి  ఎడ్లబండ్ల ద్వారా డ్రమ్ముల్లో నీటిని తీసుకొచ్చి కుండల ద్వారా కూలీలను పెట్టి మొలకకు నీరు పోశారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 9 వరకు వర్షాలు కురవడంతో అన్నదాతల్లో ఆశలు చిగురించాయి.

పంటలపై ఆశలు వదులుకున్న రైతులు మరోసారి వారి సహనాన్ని పరీక్షించుకునేందుకు తిరిగి మూడోసారి పంటలు విత్తుకున్నారు. పత్తి, సోయాబిన్ పంటలు వేశారు. అప్పటికే వరి విత్తనాలు వేసుకొని నారుమళ్లలో పశువులను వదిలారు. వరి నాట్లు వేసుకునే సమయం దాటిపోయినా కొంతమంది రైతులు మళ్లీ ఏదో చిరు ఆశతో నారు అలికి వరినాట్లు ఆలస్యంగా సెప్టెంబర్‌లో వేసుకున్నారు. కానీ ఫలితం అంతంతే. గ తేడాదితో పోల్చితే వరిసాగు 60 శాతం తగ్గింది.
 
ఖరీఫ్‌కు అందని రుణాలు..
ఖరీఫ్ ఆరంభం నుంచి రుణాల విషయంలో గందరగోళం నెలకొంది. జూన్‌లో పంట పెట్టుబడి విత్తనాలకు ఎరువులకు అయ్యే ఖర్చుల కోసం ఎదురు చూశారు. మాఫీ, కొత్త రుణాలు మంజూరు విషయంలో స్పష్టత రాకపోవడంతో ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర  అప్పలు చేశారు. గతేడాది 2013-14లో రూ.1,421 కోట్ల రుణాలు 3,16,542 మంది రైతులకు అందించారు. ప్రతి ఏడాది గ్రామీణ బ్యాంకుల్లో ఏప్రిల్ నెలలోనే రుణాలు ఇవ్వడం మొదలవుతాయి. కానీ ఈ ఏడాది ఆగస్టు వరకు కూడా రైతుల చేతికి చిల్లిగవ్వ కూడా అందలేదు. ఈ ఏడాది రూ.2,228 కోట్లని 3.20 లక్షల మంది రైతులకు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు.

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.600 కోట్లు పెంచినా, ఖరీఫ్ సమయం ముగిసినా రైతులకు చేతికి అందకపోవడం గమనార్హం. రుణమాఫీలో 25 శాతం మొదటి విడతగా బ్యాంకర్లకు అందజేయగా.. కొత్త రుణాలివ్వకండా పాత బకాయిలను అందులోంచి తీసుకున్నారు. చివరికి వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. ఖరీఫ్, రబీ కలిపి  2,41,849 మంది రైతులకు రూ.1,164 కోట్లు రుణం ఇచ్చారు. ఖరీఫ్ రుణ లక్ష్యం రూ.1,693 కోట్ల 74 లక్షలు కాగా, రబీలో రూ.534 కోట్ల 86 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ రబీ సాగు చేసే పరిస్థితి లేదు.

కొనుగోలు ఆరంభం అధోగతి
పత్తి కొనుగోళ్లు గతేడాది కంటే ముందే ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 20న జిల్లాలోని 19 వ్యవసాయ మార్కెట్ యార్డులకు గాను 6 కేంద్రాల్లో ప్రారంభించారు. ప్రభుత్వ మద్దతు ధర తో కొనుగోలు చేయాలని ప్రభుత్వం అదేశాలు ఉన్న సీసీఐ నిరాకరించడంతో ఆరంభంలోనే అధోగతి పాలైంది. పత్తిని ప్రభుత్వ రంగ సంస్థ అయిన సీసీఐ తేమ పేరిట కొర్రీలు విధిస్తూ కొనుగోలుకు నిరాకరించడంతో ప్రైవేట్ వ్యాపారులను రైతులు ఆశ్రయించాల్సి వచ్చింది. అయితే వ్యాపారులు మద్దతు ధర కంటే తక్కువగా క్వింటాలుకు రూ.3,200 నుంచి రూ.3,400 వరకు చెల్లిస్తామనడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు.

కనీసం మద్దతు ధర కూడా దక్కే పరిస్థితి లేకపోవడంతో ఆందోళనకు దిగారు. కలెక్టర్ స్పందించ... సీసీఐ అధికారలు, వ్యాపారులతో చర్చలు జరిపి మొదటి రోజు నామామత్రంగా రెండు వాహనాల పత్తిని మాత్రమే కొనుగోలు చేశారు. మరుసటి రోజు నుంచి సీసీఐ తేమ శాతంలో కొంత సడలింపుతో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ నుంచి పత్తి, నవంబర్ నుంచి సోయా కొనుగోళ్లు జరుగుతున్నాయి.

మరిన్ని వార్తలు