నత్తనడకన ‘నిమ్జ్‌’ భూసేకరణ 

8 May, 2019 02:20 IST|Sakshi
నిమ్జ్‌ కోసం సేకరించిన న్యాలకల్‌ మండలం రుక్మాపూర్‌ భూములు

12,635 ఎకరాల్లో సేకరించింది 2,925 ఎకరాలే 

రెండో విడతలో 1,269 ఎకరాలకు ప్రతిపాదనలు 

పరిహారం పెంచాలంటూ గ్రామసభల్లో ఒత్తిడి 

జీవో 123 ప్రకారం దర చెల్లిస్తామంటున్న సర్కారు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని వేగవంతం చేసేందుకు జాతీయ పెట్టుబడులు, ఉత్పత్తుల మండలి ‘నిమ్జ్‌’ ఏర్పాటుకోసం రాష్ట్రం ప్రభుత్వం చేస్తోన్న భూసేకరణ యత్నాలు ముందుకు సాగడంలేదు. మూడేళ్ల క్రితం ఈ నిమ్జ్‌ ఏర్పాటుకు 50 చదరపు కిలోమీటర్ల పరిధిలో కచ్చితంగా ఐదువేల హెక్టార్లు (సుమారు 12,500 ఎకరాలు) సేకరించాలని కేంద్రం నిర్దేశించింది. దీనిలో భాగంగా 2016 మార్చి లోగా భారీ పారిశ్రామికవాడ స్థాపనకు అవసరమైన తొలి విడత భూమి ని సేకరిస్తేనే ‘నిమ్జ్‌’ హోదా దక్కుతుందని షరతు విధించింది. దీంతో నిమ్జ్‌ స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ ప్రాంతాన్ని ఎంపిక చేసి భూ సేకరణ ప్రారంభించింది.

రాష్ట్రంలో వరుస ఎన్నికలు ఓవైపు, మరోవైపు ప్రభుత్వం చెల్లించే ధర తమకు ఆమోదయో గ్యం కాదంటూ రైతులు చెబుతుండటంతో తొలి విడత భూసేకరణ ప్రక్రియ కొలిక్కి రావట్లేదు. 12,635 ఎకరాలకు గానూ తొలి విడతలో న్యాలకల్‌ పరిధిలోని ముంగి, రుక్మాపూర్‌తో పాటు, ఝరాసంగం మండల పరిధిలో బర్దీపూర్, చీలపల్లి, ఎల్గో యి గ్రామాల పరిధిలో 3,501 ఎకరాలు సేకరించాలని రెవెన్యూ విభాగానికి లక్ష్యం విధించారు. 2016లో భూ సేకరణ ప్రక్రియ ప్రారంభం కాగా, ఇప్పటి వరకు రూ.132.85 కోట్లు వెచ్చించి 2,925 ఎకరాలుసేకరించారు. తొలి విడతలో సేకరించాల్సిన మిగతా 566 ఎకరాల భూమిలో గ్రామ కంఠం, చెరువులు, కుంటలతో పాటు కొన్ని భూములపై కోర్టు కేసులతో భూ సేకరణ ముందుకు సాగడం లేదు.  

ధర చెల్లింపుపై రైతుల అసంతృప్తి 
రాష్ట్ర భూ సేకరణ చట్టం 2017లోని జీవో 123 నిబంధనలకు అనుగుణంగా తొలి విడతలో 2,925 ఎకరాల పట్టా, అసైన్‌మెంట్, ప్రభుత్వ భూములను రెవెన్యూ యంత్రాంగం సేకరించింది. ఎకరాకు అసైన్డ్‌ భూములకు రూ.3.25 లక్షలు, పట్టా భూములకు రూ.5.65లక్షల చొప్పున చెల్లించారు. అసైన్డ్‌ భూములకు సంబంధించి కొన్ని చోట్ల రైతులు కబ్జా లో ఉన్నా.. సాంకేతిక అంశాలను కారణంగా చూపు తూ పరిహారం చెల్లించేందుకు అధికారులు నిరాకరించారు. నిమ్జ్‌ ఏర్పాటు ప్రకటనతో స్థానికంగా ఎకరా భూమి ధర రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల పైనే పలుకుతోంది. దీంతో రైతులు, రైతు కూలీలు ఆందో ళన చెందుతున్నారు. తమకు భూసేకరణపై అవగాహన కల్పించకుండా, హడావుడిగా భూములు తీసుకున్నారని తొలి విడతలో భూములు కోల్పోయిన రైతులు ఆరోపిస్తున్నారు. తమకు చెల్లించాల్సిన పరిహారం పెంచాలని డిమాండు చేస్తున్నారు.  

ధర పెంచాలంటూ రైతుల ఒత్తిడి 
రెండు, మూడు విడతల్లో సేకరించే భూముల్లో ఎక్కు వ శాతం పట్టా భూములే ఉన్నాయి. రెండో విడతలో 1,269 ఎకరాల సేకరణ ప్రతిపాదనలను నిమ్జ్‌ వర్గా లు రెవెన్యూ శాఖకు పంపించాయి. ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. దీంతో భూములు అప్పగించాల్సిందిగా కోరుతూ సంబంధిత గ్రామాల్లో జహీరాబాద్‌ ఆర్డీఓ, రెవెన్యూ అధికారులు సదస్సులు నిర్వహించారు. ఎకరాకు రూ.7 లక్షలు చెల్లిస్తామని రెవెన్యూ అధికారులు చెప్తుండగా, రైతులు మాత్రం భూమి ధరను పెంచాలని డిమాండ్‌ చేస్తుండటంతో భూ సేకరణ సవాలుగా మారింది. 

నిమ్జ్‌ ఏర్పాటైతే కేంద్రం నుంచి వచ్చేవి ఇవి... 
నిమ్జ్‌ను జాతీయ రహదారులతో అనుసంధానం, మౌలిక సదుపాయాల కల్పనకు అయ్యే వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం వంద శాతం గ్రాంటు రూపంలో ఇస్తుంది. ఆ తర్వాత పారిశ్రామిక పార్కులో ఏర్పాటయ్యే పరిశ్రమలకు విడిగా ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తుంది. ఈ లెక్కన జహీరాబాద్‌ నిమ్జ్‌లో మౌలిక సదుపాయాలకు రూ.3వేల కోట్లు గ్రాంటు రూపంలోనూ.. అందులో ఏర్పాటయ్యే పరిశ్రమలకు రూ.4వేల కోట్ల మేర ప్రోత్సాహకాలు, రాయితీ రూపంలో అందే వీలుంది.  

మరిన్ని వార్తలు