మలిదశ పోరుకు సన్నద్ధం

24 Aug, 2019 11:41 IST|Sakshi

పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర..

పసుపు బోర్డు సాధనే లక్ష్యం

ఆందోళనలకు సిద్ధమవుతున్న రైతులు

ఆర్మూర్‌ వేదికగా ఆదివారం సమావేశం

సాక్షి, నిజామాబాద్‌ : పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధరను ప్రకటించడంతో పాటు పసుపు బోర్డును ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో గతంలో ఉద్యమించిన రైతులు మలిదశ ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు. ఆదివారం ఆర్మూర్‌ మార్కెట్‌ యార్డులో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి కార్యాచరణను ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నారు. గతంలో మాదిరిగా రాజకీయ పార్టీలకు అతీతంగానే సమావేశాన్ని నిర్వహించడానికి రైతులు సిద్ధమవుతున్నారు. పార్లమెంట్‌ ఎన్నికలకు ముందుగా ఉద్యమం నిర్వహించిన రైతులు ప్రభుత్వం దిగిరాకపోవడంతో నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి మూకుమ్మడిగా పోటీచేశారు. 170 మంది రైతులు ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దిగి జాతీయ స్థాయిలో చర్చకు అవకాశం కల్పించారు.

ఎన్నికలు ముగిసిన తరువాత తమ సమస్యలు పరిష్కారం అవుతాయని రైతులు భావించారు. కానీ పసుపు, ఎర్రజొన్నలకు మద్దతు ధర ప్రకటన ఇంత వరకు జరగలేదు. అంతేకాకుండా పసుపు బోర్డు ఏర్పాటుకు సంబంధించి ఒక్క అడుగూ ముందుకు పడలేదు. పంటలు చేతికి వచ్చిన సమయంలోనే ఆందోళనలను నిర్వహించడం, ఆ సమయంలో ప్రభుత్వం స్పందించినా స్పందించకపోయినా పంటలను తక్కువ ధరకైనా విక్రయించడం జరుగుతుంది. దీనివల్ల నష్టపోతున్నామని రైతులు భావిస్తున్నారు. పంటలు చేతికి రావడానికి ఇంకా సమయం ఉండడంతో ఇప్పటి నుంచే ఆందోళన కార్యక్రమాలను నిర్వహించడం వల్ల ప్రభుత్వంపై ఒత్తిడి పెంచవచ్చని రైతులు ఆలోచిస్తున్నారు. అందువల్ల కార్యాచరణను రూపొందించి ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తే ప్రభుత్వం కదిలివచ్చి తమ పంటలకు గిట్టుబాటు ధరను ప్రకటిస్తుందని రైతులు ఆశిస్తున్నారు. పసుపు పంటకు క్వింటాలుకు రూ. 15 వేలు, ఎర్రజొన్నలకు క్వింటాలుకు రూ. 3,500ల మద్దతు ధరను రైతులు కోరుతున్నారు. అలాగే పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని బీజేపీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది.

ఆశించినట్లుగానే నిజామాబాద్‌ స్థానాన్ని బీజేపీ గెలుచుకోవడంతో పాటు కేంద్రంలోనూ మరోసారి ప్రభుత్వం ఏర్పడింది. అయినా పసుపు బోర్డు ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి చర్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకోకపోవడంతో రైతులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాలలోనే పసుపు, ఎర్రజొన్న పంటలను రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. అందువల్ల ఈ ప్రాంతంలోనే ఉద్యమాన్ని నిర్వహించి ప్రభుత్వాన్ని కదిలించాలని రైతులు భావిస్తున్నారు. ఆదివారం నిర్వహించే సమావేశానికి అన్ని గ్రామాల నుంచి రైతులు రాజకీయ పార్టీలకు అతీతంగానే హాజరుకావాలని ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న నేతలు సూచించారు. పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర, పసుపు బోర్డు ఏర్పాటు అంశాలపై మలిదశ ఆందోళనకు రైతులు సిద్ధం అవుతుండగా పరిణామాలు ఎలా ఉంటాయో వేచిచూడాల్సి ఉంది.

ప్రభుత్వం దిగివచ్చే వరకు ఉద్యమం
పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర, పసుపు బోర్డు ఏర్పాటు అంశాలపై ప్రభుత్వం దిగివచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తాం. ఎన్నికల సమయంలో మా సత్తా ఏమిటో చాటాం. అయినా ప్రభుత్వం స్పందించలేదు. అందువల్లనే మలిదశ ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. రైతులందరు సహకరిస్తారని ఆశిస్తున్నాం.
– అన్వేష్‌రెడ్డి, రైతు ఉద్యమ నాయకుడు 

>
మరిన్ని వార్తలు