ముందుకు సాగని ‘ముచ్చోనిపల్లె’ పనులు

15 Oct, 2019 11:05 IST|Sakshi
రిజర్వాయర్‌ కట్ట వద్ద రైతులతో మాట్లాడుతున్న పోలీసులు, ఇంజనీరింగ్‌ అధికారులు

రెండోరోజు నీటి తరలింపు

పనులను అడ్డుకున్న రైతులు

డీఈ సర్దిచెప్పినా వినని రైతులు

గట్టు (గద్వాల): ముచ్చోనిపల్లె రిజర్వాయర్‌ నీటి తరలింపు పనులు ముందుకుసాగలేదు. ఈ వ్యవహారంపై రెండోరోజు సోమవారం కూడా రిజర్వాయర్‌ దగ్గర కాలువ పనులను ఆయా గ్రామాల రైతులు అడ్డుకున్నారు. సాగు నీటి శాఖ అధికారులు, పోలీసులు రైతులకు ఎంతగా నచ్చ చెప్పినా రైతులు మాత్రం నీటి తరలింపునకు అంగీకరించే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పారు. ఉదయం నెట్టెంపాడు డీఈ కిరణ్, గట్టు ఎస్‌ఐ మంజునాథ్‌రెడ్డి ముచ్చోనిపల్లె రిజర్వాయర్‌ దగ్గరకు వెళ్లారు. ముచ్చోనిపల్లె, మిట్టదొడ్డి, చాగదొన, తుమ్మలపల్లి గ్రామాలకు చెందిన రైతులు కూడా రిజర్వాయర్‌ కట్ట దగ్గరకు చేరుకున్నారు. అయిజ మండలలోని శేషమ్మ చెరువు, ఎక్లాస్‌పూర్‌ చెరువుతో పాటుగా చిన్న కుంటలకు నీటిని వదిలేందుకు ఇంజనీరింగ్‌ అధికారులు ముచ్చోనిపల్లె గ్రామం వైపు ఉన్న తూం దగ్గర నుంచి రిజర్వాయర్‌ కట్ట పొడవునా  వాగు వరకు కాల్వను తవ్వే పనులను చేపట్టారు.

నీటి వృథాను ఒప్పుకునే ప్రసక్తే లేదు..
అయితే కాల్వ తవ్వకంలో రాళ్లను పగుల కొట్టేందుకు బ్లాస్టింగ్‌ చేయడానికి లారీని రిజర్వాయర్‌ కట్ట దగ్గరకు తీసుకు రావడంతో రైతులు అడ్డుకున్నారు. రిజర్వాయర్‌ను పూర్తి స్థాయిలో నింపకుండా ఉన్న కొద్ది పాటు నీటిని వృథాగా వాగుల వెంట వదలడానికి తాము అంగీకరించే ప్రసక్తే లేదని రైతులు తెలిపారు. రిజర్వాయర్‌ నీటిని కిందకు వదిలితే మా పంటల పరిస్థితి ఎంటని రైతులు ప్రశ్నించారు. డీఈ కిరణ్‌ ఆయా గ్రామాల రైతులకు నీటి తరలింపు విషయంపై ఎంతగా నచ్చ చెప్పినా, రైతులు వినలేదు. పనులు జరుగనిచ్చే సమస్యే లేదంటూ ఆయా గ్రామాల రైతులు తేల్చి చెప్పడంతో చేసేదేమి లేక అధికారులు వెనుతిరిగారు. విషయాన్ని ఎస్‌ఈ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు డీఈ కిరణ్‌ తెలిపారు. అయిజ మండలంలోని చెరువులను నింపేందుకు రెండు అవకాశాలు ఉన్నట్లు డీఈ కిరణ్‌ తెలిపారు. ర్యాలంపాడు రిజర్వాయర్‌ నుంచి వచ్చే కాల్వ డీ6 నుంచి 7ఎల్‌ ఆఫ్‌ 3ఎల్‌ నుంచి కేవలం కిలోమిటర్‌ మేర కాల్వ తవ్వితే చెరువులోకి నీరు వస్తాయని, ముచ్చోనిపల్లె రిజర్వాయర్‌ ద్వారా అయిజ వాగు నుంచి కూడా నీటిని తరలించేందుకు అవకాశం ఉందని తెలిపారు. చెరువులను నింపేందుకు ఓటి మంజూరైనట్లు డీఈ తెలిపారు. రైతులు అభ్యంతరం తెలపడంతో పనులు నిలిపివేసినట్లు  డీఈ తెలిపారు.  

మరిన్ని వార్తలు