రహదారుల దిగ్బంధం

17 Feb, 2019 03:41 IST|Sakshi
నిజామాబాద్‌ జిల్లా పెర్కిట్‌ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించిన రైతులు

గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కిన రైతన్న 

ఎర్రజొన్న, పసుపు పంటలకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్‌ 

రోడ్లపైనే వంటావార్పు 

ఉదయం 11 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు ఆందోళన 

రేపు కలెక్టరేట్‌ ముట్టడికి పిలుపు

ఆర్మూర్‌: పసుపు, ఎర్రజొన్న రైతులు పోరుబాట పట్టారు. వారం రోజులుగా ధర్నాలు, రాస్తారోకోలతో తమ నిరసన తెలుపుతున్న అన్నదాతలు.. శనివారం రహదారుల దిగ్బంధనం చేశారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించి, రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే డిమాండ్‌ చేశారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ ప్రాంత రైతాంగం శనివారం 44వ నంబర్‌ జాతీయ రహదారిని దిగ్బంధించింది. ఆర్మూర్‌ మండలం పెర్కిట్‌ శివారులో, జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో రోడ్లపై బైఠాయించారు. వంటావార్పుతో నిరసనను హోరెత్తించారు. జక్రాన్‌పల్లిలో పెద్ద సంఖ్యలో మహిళా రైతులు ధర్నాలో పాల్గొన్నారు. అయితే ఆందోళనలను నియంత్రించడంలో భాగంగా నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్తికేయ ఆర్మూర్‌ డివిజన్‌ పరిధిలోని 14 గ్రామాల్లో రెండు రోజుల పాటు 144 సెక్షన్‌ను విధించారు. అర్ధరాత్రి రైతు నాయకులను అరెస్టు చేసి ఇతర పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. అయినా రైతులు నిషేధాజ్ఞలను లెక్కచేయకుండా పోరుబాట పట్టారు. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ ఎర్రజొన్న పంటకు క్వింటాలుకు రూ. 3,500, పసుపు పంటకు రూ.15 వేల గిట్టుబాటు ధర కల్పించి, ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. డిమాండ్లు నెరవేర్చేంత వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు.  

ట్రాఫిక్‌ మళ్లింపు 
పోలీసు యంత్రాంగం అప్రమత్తమై.. ట్రాఫిక్‌ను దారి మళ్లించింది. జాతీయ రహదారిపై నుంచి వస్తున్న వాహనాలను ఇతర మార్గం ద్వారా డైవర్ట్‌ చేశారు. దీంతో ట్రాఫిక్‌ సమస్య ఉత్పన్నం కాలేదు. ధర్నా విరమించాలని సీపీ కార్తికేయ, ఆర్మూర్‌ ఏసీపీ రాములు రైతులను కోరినా వినిపించుకోలేదు. కలెక్టర్‌ రామ్మోహన్‌రావు స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని స్పష్టం చేశారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఆందోళనను శనివారం రాత్రి 9 గంటలకు విరమించారు.  
జక్రాన్‌పల్లి వద్ద జాతీయ రహదారిపై వంటావార్పులో పాల్గొన్న మహిళా రైతులు 

రేపు కలెక్టరేట్‌ ముట్టడి 
రాత్రి సమావేశమైన రైతులు.. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. ఆదివారం సెలవు రోజు కావడంతో అధికారులు అందుబాటులో ఉండరని భావించిన రైతులు.. సోమవారం కలెక్టరేట్‌ ముట్టడికి పిలుపునిచ్చారు.  

మరిన్ని వార్తలు