కలెక్టరేట్‌ ఎదుట రైతుల ఆత్మహత్య యత్నం

11 Nov, 2019 15:14 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: తన భూమిని రిజిస్ట్రేషన్‌ చేయాలేదనే కోపంతో అబ్దుల్లాపూర్‌మేట్‌ ఎమ్మార్వో విజయారెడ్డిని హత్య చేసిన ఘటన తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలో పలు జిల్లాలోని రైతులు భూ సమస్యలను తీర్చాలంటూ కలెక్టరేట్‌, ఆర్డీవో కార్యాలయాల ముందు ఆత్మహత్య యత్నానికి పాల్పడుతున్నారు.

వివరాల్లోకి వెళితే....నిజామాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ ఆవరణలో ఓ రైతు ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామానికి చెందిన అంకం గంగాధర్‌ అనే రైతు చెట్టెక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ సోమవారం కలెక్టరెట్‌ ముందు బెదిరింపులకు దిగాడు. దీంతో ఓ పోలీసు అధికారి చెట్టెక్కి తాడు లాగి రైతును కిందకు దించారు. కాగా అన్నదమ్ముల మధ్య జరుగుతున్న బోరు సమస్యను దర్పల్లి మండలం ఎమ్మార్వోకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదని అందుకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు రైతు తెలిపాడు. ఇప్పటికైనా బోరు సమస్యను తక్షణమే పరిష్కారించాలని రైతు కోరాడు.

బోధన్: ఆర్డీవో కార్యాలయంలో ఓ మహిళా రైతు ఆత్మహత్యా యత్నం చేసింది. తగ్గెళ్ళి గ్రామానికి చెందిన అబ్బవ్వ అనే మహిళా రైతు తన డిజిటల్‌ పట్టా పాస్‌బుక్‌ కోసం ఏడాదిగా బోధన్‌ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతోంది. అయినా వారు పట్టించుకోవడం లేదంటూ ఇవాళ కార్యాలయం ముందు పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. దీంతో పోలీసులు ఆమెను అడ్డుకుని విచారించగా తన భూమిని ఇతరుల పేరు మీదకు మార్చారని  ఆవేదన వ్యక్తం చేసింది. 

జనగామ జిల్లా: అలాగే జనగామ జిల్లాలోని లింగాల గణపురం మండలం గమ్మడవెల్లి గ్రామానికి చెందిన చెంగిర్ల వెంకటేష్‌ అనే రైతు ఎకరం భూమిని తన పేరు మీదకు పట్టా చేయడం లేదంటూ ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. దీంతో స్థానికులు అతనిని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు రైతును స్టేషన్‌కు తరలించారు. ఈ మూడు సంఘటనలు తెలంగాణలో కలకలం రేపుతున్నాయి.

మరిన్ని వార్తలు