రైతుబంధుపై ఆందోళన వద్దు

13 Jun, 2019 12:53 IST|Sakshi
జలాల్‌పూర్‌ సభలో మహిళా రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

బషీరాబాద్‌: మీ సేవలో ఆధార్‌ లింక్‌ చేసుకున్న రైతులందరికీ త్వరలో పాసుపుస్తకాలు అందజేస్తామని కలెక్టర్‌ ఆయేషా మస్రత్‌ ఖానమ్‌ తెలిపారు. రైతుబంధు రాలేదని ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. బషీరాబాద్‌ మండలం జలాల్‌పూర్‌లో బుధవారం నిర్వహించిన రెవెన్యూ గ్రామ సభకు హాజరైన కలెక్టర్‌  రైతుల సమస్యలను తెలుసుకున్నారు. నీళ్లపల్లి అటవీ ప్రాంతం లోని భూములకు సంబంధించి పాసుపుస్తకాలు ఉన్న వారికి పదిహేను రోజుల్లో రైతుబంధు సాయం అందుతుందని చెప్పారు. ఈకేవైసీ చేసుకోని రైతులు వెంటనే మీ సేవ కేంద్రానికి వెళ్లి ఆధా ర్‌ అనుసంధానం చేయించుకోవాలన్నారు. జలాల్‌పూర్‌లో చెం చులు తమకు పాసుపుస్తకాలు రాలేదని కలెక్టర్‌కు విన్నవించారు. దీనిపై స్పందించిన ఆమె సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ వేప చేదు ఉమామహేశ్వరి, వీఆర్‌ఓ పెంటప్ప, రైతులు పాల్గొన్నారు.

బడిబాటను విజయంవంతం చేయాలి...  
వికారాబాద్‌ అర్బన్‌: జిల్లాలో ఈ నెల 14 నుంచి 19వరకు అన్ని పాఠశాలల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్‌ ఆయేషా మస్రత్‌ ఖానమ్‌ అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖ అధికారులతో బుధవారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 14న వికారాబాద్‌ పట్టణంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. జిల్లా, మండల స్థాయి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను ఇందులో భాగస్వాములను చేయాలని తెలిపారు. 6 నుంచి 14 సంవత్సరాలలోపు బడీడు పిల్లలను గుర్తించి వారిని వివిధ పాఠశాలల్లో చేర్పించాలన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ఏడీ భరత్‌ కుమార్, అసిస్టెంటు కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ చంద్రశేఖర్‌గౌడ్, డీడబ్ల్యూఓలు జ్యోత్స్న, హన్మంతరావు, చైల్డ్‌లైన్‌ సభ్యులు పాల్గొన్నారు.
 
బషీరాబాద్‌ ఎందుకు వెనకబడింది.. 
బషీరాబాద్‌: మరుగుదొడ్ల నిర్మాణంలో బషీరాబాద్‌ మండలం ఎందుకు వెనకబడిందని కలెక్టర్‌ ఆయేషా మస్రత్‌ ఖానమ్‌ అధికారులను నిలదీశారు. ఎట్టి పరిస్థితిలోనూ ఈ నెలాఖరుకు మండలంలో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తికావాలని ఆదేశించారు. మండల కేంద్రంలోని రాధాకృష్ణ సమావేశ మందిరంలో డీఆర్‌డీఏ పీడీ జాన్సన్, ఎంపీపీ కరుణ, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో మండలాన్ని ఓడీఎఫ్‌గా మార్చడానికి బాధ్యతగా పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో ఎక్కడైనా సమస్యలు వస్తే స్తానిక ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య పరిష్కరించుకోవాలనితెలిపారు. ఇసుక సమస్య లేకుండా తహసీల్దార్‌  అనుమతులు ఇస్తారని చెప్పారు. గ్రామాల వారీగా కమిటీలు వేసుకొని ఉద్యమంలా నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణాలు చేపట్టడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే.. ఈ బాధ్యతలను స్థానికులకు అప్పగిస్తామని చెప్పారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి రవి, ఎంపీడీఓ అనురాధ, ఈఓపీఆర్డీ ఉమాదేవి, ఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి, ఉపాధి, వెలుగు అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు