రుణమాఫీపై.. అన్నదాత ఆశలు

30 May, 2014 02:20 IST|Sakshi
రుణమాఫీపై.. అన్నదాత ఆశలు

జిల్లాలో రైతులు తీసుకున్న రుణాలు రూ.5,725.46 కోట్లు
- టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడంతో పెరిగిన ఆశలు
- ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన కేసీఆర్
- రుణాలు పొందిన రైతులు 6.60లక్షల మంది
సాక్షిప్రతినిధి, నల్లగొండ : కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం జూన్ 2న కొలువు దీరనుంది. ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా 14 ఏళ్ల కిందట పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఈ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. తెలంగాణ ప్రాంత రైతాంగ కడగండ్లు, కష్టాల గురించి క్షుణ్ణంగా తెలిసిన కేసీఆర్ సీఎం పీఠాన్ని అధిష్ఠించనున్నారు. ప్రధానంగా ఆయన తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతిచోటా రైతుల రుణమాఫీ గురించి పదే పదే హామీ ఇచ్చారు.

జిల్లా ప్రజానీకం సైతం మునుపెన్నడూ చూపనంత అభిమానం టీఆర్‌ఎస్ పట్ల చూపించి ఒక ఎంపీ, ఆరు ఎమ్మెల్యే స్థానాలను ఆ పార్టీకి కట్టబెట్టింది. ఇప్పుడిక, టీఆర్‌ఎస్ ప్రభుత్వం తన మాట నిలబె ట్టుకుంటుందా..? కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేరుస్తారా..? రైతులు బ్యాంకుల్లో, సహకార సంస్థల్లో తీసుకున్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తారా..? అన్న అంశంపైనే చర్చంతా జరుగుతోంది. జిల్లాలో వ్యవసాయంపై ఆధారపడిన వారే అధికంగా ఉన్నారు.

కోదాడ, హుజూర్‌నగర్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ నియోజకవర్గాలు పూర్తిగా సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో ఉన్నాయి. ఇక, మిగిలిన నియోజకవర్గాల్లో ఒకటీ రెండు మినహా అంతంత మాత్రపు సాగునీటి సౌకర్యానికి నోచుకున్నవే. అయినా, రైతులు భూగర్భ జలంపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. మెట్ట పంటలతో పాటు, వరి సాగుకోసం రైతులు ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక, ఒక్కోసారి అనావృష్టికి, మరికొన్ని తడవలు అతివృష్టికి గురై పంటలు కోల్పోయి అప్పుల కుప్పవుతున్నారు.

వడ్డీ వ్యాపారులు, ఆయా ప్రైవేటు వ్యక్తుల దగ్గర చేసిన అప్పుల విషయాన్ని పక్కన పెడితే, రైతాంగం బ్యాంకుల దగ్గర తీసుకున్న రుణాలు రూ.వేల కోట్లలో ఉన్నాయి. టీఆర్‌ఎస్ తన ఎన్నికల హామీగా ఇచ్చిన రుణమాఫీ ఒక విధంగా రైతుకు వరంగా మారనుంది. జిల్లా వ్యాప్తంగా 6,60,776 మంది  రైతులు వివిధ బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందారు. అన్ని రకాల రుణాలు కలిపి గత ఏడాది రెండు సీజన్లకు గాను జిల్లాల రైతులు *5,725.46కోట్లు బ్యాంకుల దగ్గర తీసుకున్నారు.

ఇలా బ్యాంకుల దగ్గర రుణాలు పొందిన రైతుల్లో అత్యధికులు చిన్న, సన్నకారు వర్గానికి చెందిన వారే. ఎకరా, రెండెకరాల పొలం సాగు కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి రుణాలు పొందిన వారే. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రుణమాఫీ నిర్ణయాన్ని అధికారికంగా తీసుకుంటే లక్షలాది మంది సన్న, చిన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. జూన్ 2వ తేదీన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న కేసీఆర్ తన తొలి సంతకం ఏ ఫైలుపై చేస్తారో అన్న ఉత్కంఠ ఉంది.

 రైతాంగం మాత్రం రుణమాఫీ ఫైలుపైనే తొలి సంతం పెట్టాలని ప్రగాఢంగా ఆశిస్తున్నారు. రైతులు జిల్లాలోని ఆయా బ్యాంకుల నుంచి క్రాప్‌లోన్లు, వ్యవసాయ అవసరాల కోసం గోల్డ్‌లోన్లు, స్వల్పకాలిక పంట ఉత్పత్తుల రుణాలు, టర్ము లోన్లు,  బర్లు, గొర్లు, పాడిపశువులు తదితర వ్యవసాయ అనుంబంధ కార్యక్రమాల అవసరాల  కోసం అప్పులు చేశారు. ఇపుడందరి చూపు ఎపుడెపుడు రుణమాఫీ నిర్ణయం వెలువుడుతుందా అన్న అంశంపైనే ఉంది.

మరిన్ని వార్తలు