యూరియా కష్టాలు

1 Sep, 2019 10:30 IST|Sakshi
మోమిన్‌పేటలో బారులుతీరిన రైతులు

కొరతతో రైతుల ఇబ్బందులు  

సాక్షి, మెమిన్‌పేట: ఖరీఫ్‌ రైతులకు కష్టాలు తప్పడం లేదు. యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల వర్షాలు కురుస్తుండడంతో పంటలకు పైపాటుగా యూరియా వేసేందుకు జిల్లాలోని ఆయా పీఏసీఎస్‌ల వద్ద శనివారం బారులు తీరారు. మోమిన్‌పేట, మేకవనంపల్లి సహకార సంఘాల్లో శనివారం 920 బస్తాల యూరియా అందుబాటులో ఉండగా రైతులు అందుకు రెండింతలు కొనుగోలు చేసేందుకు వచ్చారు. శుక్రవారం సాయంత్రం కొద్దిపాటి వర్షం కురవడంతో పత్తి పంటకు పైపాటుగా వేసుకునేందుకు రైతులు సిద్ధమయ్యారు. దీంతో శనివారం ఉదయం నుంచే మోమిన్‌పేట పీఏసీఎస్‌ ఎదుట క్యూ కట్టారు. ఎకరానికి 2 బస్తాల చొప్పున 460 బస్తాలను సిబ్బంది రైతులకు విక్రయించారు.

ఇంకా 70 మంది రైతులు వరుసలో నిలబడినా వారికి అందలేదు. మేకవనంపల్లిలో అడిగిన మేరకు సిబ్బంది రైతులకు విక్రయించారు. 45 కిలోల యూరియా బస్తాను రూ.266.50 చొప్పున అమ్మేశారు. ప్రైవేట్‌ ఫెర్టిలైజర్‌ దుకాణాల్లో యూరియా అందుబాటులో లేదు. దుకాణాదారులకు ఎక్కువ ధరకు టోకు డీలర్లు విక్రయిస్తుండడంతో వారికి గిట్టుబాటు కాకపోవడంతో తీసుకురావడం లేదు. కేవలం పీఎసీఎస్‌ల ద్వారానే యూరియా విక్రయిస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో సుమారు 500 మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం. ఇప్పటివరకు 50 మెట్రిక్‌ టన్నుల యూరియా మాత్రమే సరఫరా అయ్యింది. దీంతో రైతులు యూరియా కోసం తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. అధికారులు స్పందించి యూరియా కొరత తీర్చాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.   

రైతుల అవస్థలు 
వికారాబాద్‌ అర్బన్‌: వర్షాలు కురుస్తుండడంతో రైతులు మొక్కజొన్న, పత్తి పంటలకు యూరియా వేస్తున్నారు. సబ్సిడీ ఎరువు అవసరం మేరకు లభించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శివారెడ్డిపేట్‌ పీఏసీఎస్, సీఎంఎస్‌లలో సబ్సిడీ ద్వారా యూరియా విక్రయిస్తున్నారు. వారంరోజులుగా రైతులు ఉదయం 7 గంటలకే యూరియా కోసం వచ్చి కార్యాలయాల ఎదుట బారులు తీరుతున్నారు. గంటల తరబడి వరుసలో నిలబడినా కొంత మందికి లభించడం లేదు. రైతులందరికీ యూరియా అందాలనే ఉద్దేశంతో సిబ్బంది కొంత పరిమితి ఒక్కొక్కరికి రెండు, మూడు బస్తాలను మాత్రమే ఇస్తున్నారు.  

అధిక ధరలకు విక్రయం 
పెద్దేముల్‌: మండల పరిధిలో వ్యాపారులు ఎక్కువ ధరకు యూరియా విక్రయిస్తున్నారు. 45 కిలోల యూరియా బస్తాను రూ.267కు విక్రయించాల్సి ఉండగా రూ.330కి తగ్గకుండ అమ్ముతున్నారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తట్టెపల్లి ప్రాథమిక సంఘానికి ఇప్పటి వరకు 650 టన్నుల యూరియా వచ్చిందని, అయినా రైతలకు సరిపోవడం లేదని సీఈఓ రాజమౌలి తెలిపారు. ఇంకా 500 టన్నుల యూరియా అవసరం ఉందన్నారు. ప్రస్తుతం రైతులు పత్తి, కంది, మొక్కజొన్న పంటలకు యూరియాను వినియోగిస్తున్నారు. సర్కారు స్పందించి అవసరం మేరకు యూరియాను సరఫరా చేయాలని కోరుతున్నారు.  

యూరియా కొతర 
ధారూరు: ధారూరు పీఏసీఎస్‌ ద్వారా ఇంతవరకు వచ్చిన 8,430 బస్తాల యూరియాను శనివారం వరకు రైతులకు సరఫరా చేశారు. మరో 2 వేల బస్తాల వరకు స్టాక్‌ వస్తే రైతులకు సరిపోతుందని సీఈఓ నర్సింలు తెలిపారు. ఆర్డర్‌ ప్రకారం వస్తున్న యూరియాను రైతుల రాకను బట్టి సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆదివారం సరఫరా చేయాలని నిబంధన ఉన్నా.. స్టాక్‌ లేదు.   

మరిన్ని వార్తలు