మాకూ రిజర్వేషన్లు కావాలి

30 Jan, 2019 03:41 IST|Sakshi

రైతుల పిల్లలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లకు డిమాండ్‌

తొలిసారిగా ప్రతిపాదన తెచ్చిన కిసాన్‌ కాంగ్రెస్‌

 దక్షిణాది రాష్ట్రాల కిసాన్‌ కాంగ్రెస్‌ సదస్సులో పలు ప్రతిపాదనలు

 టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్, వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, ఏఐసీసీ కార్యదర్శుల గైర్హాజరు

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని రైతు కుటుంబాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కావాలనే డిమాండ్‌కు హైదరాబాద్‌ వేదికైంది. మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల కిసాన్‌ కాంగ్రెస్‌ సదస్సులో తొలిసారి ఈ ప్రతిపాదన వచ్చింది. ‘మాకూ రిజర్వేషన్లు కావాల్సిందే. వ్యవసాయం చేసే కుటుంబాలకు చెందిన పిల్లలకు అన్ని సామాజిక వర్గాల తరహాలో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. రైతుల పిల్లలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి’అని సదస్సులో పాల్గొన్న రైతు నేతలు డిమాండ్‌ చేశారు. రైతు పక్షపాతిగా ప్రభుత్వాలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని కేరళ ప్రతినిధి లాలా వర్గీస్‌ అన్నారు.

రైతుల సమస్యల పరిష్కార మార్గాలను శాశ్వత ప్రాతిపదికన అమలు జరిపినప్పుడే రైతు సంక్షేమం సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. దుక్కి దున్నే సమయం నుంచి పంట అమ్ముకునే వరకు రైతుకు, సమాజంలోని ఇతర వర్గాల మధ్య తలెత్తే వివాదాలతో పాటు అంతర్గతంగా రైతు వర్గంలో ఉండే వివాదాలను పరిష్కరించడానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వైపరీత్యాల వల్ల నష్టం జరిగిన 48 గంటల్లో రైతుకు పరిహారమందేలా ప్రభుత్వ విధానాల్లో మార్పులు తీసుకురావాలని డిమాండ్‌ చేశారు.

తమిళనాడుకు చెందిన మరో ప్రతినిధి మాట్లాడుతూ పంట పండించడానికి ముందే గిట్టుబాటు ధర నిర్ణయించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ కిసాన్‌ సెల్‌ చైర్మన్‌ అన్వేష్‌రెడ్డి మాట్లాడుతూ భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా రాష్ట్రంలోని 30 శాతం మంది రైతులకు పాసుపుస్తకాలు రాలేదని ఆరోపించారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని మరో నేత కృష్ణారెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదించగా.. ఏకగ్రీవంగా సదస్సు ఆమోదించింది. 

ఉత్తమ్‌తో పాటు పలువురు గైర్హాజరు 
ఏఐసీసీ కిసాన్‌ సెల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక్కరోజు సదస్సుకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హాజరు కాలేదు. షెడ్యూల్‌ ప్రకారం ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నా స్వల్ప అనారోగ్య కారణంతో ఆయన రాలేదని గాంధీభవన్‌ వర్గాలు తెలిపాయి. అలాగే టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు రేవంత్‌రెడ్డి, కుసుమకుమార్, ఏఐసీసీ కార్యదర్శులు మధుయాష్కీ, సంపత్, చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి, అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్‌లు కూడా హాజరు కాకపోవడం గమనార్హం. 

మరిన్ని వార్తలు