గిట్లనే ఉంటదా?

28 Sep, 2018 14:27 IST|Sakshi
గత సోమవారం గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్న బాధితులు

సబ్‌స్టేషన్ల నిర్మాణానికి భూములిచ్చిన నిర్వాసితులకు మొండిచేయి 

ఐదేళ్లయినా అతీగతీ లేని పరిస్థితి 

పట్టించుకోని విద్యుత్‌ శాఖ అధికారులు 

ఆందోళనల ఉధృతానికి బాధితుల కార్యాచరణ

నేలకొండపల్లి : పోటీ ప్రపంచంలో ఏళ్లతరబడి చదివినా కొలువులు రాని పరిస్థితి. ఉన్న భూమిలో కొంత ప్రభుత్వానికి ఇస్తే కొడుకులకు కొలువొస్తుందని ఆ తల్లిదండ్రులు ఆశపడ్డారు. విద్యుత్‌ శాఖ అధికారులు అడిగిందే తడవుగా గ్రామాల్లో సబ్‌స్టేషన్ల నిర్మాణానికి భూములిచ్చారు. స్థలం ఇచ్చిన రైతు కుటుంబాలకు రెండు ఉద్యోగాలు ఇస్తామని ఐదేళ్ల క్రితం అధికారులు హామీ ఇచ్చారు. ఏళ్లు గడిచినా హామీ అమలుకు నోచుకోకపోగా.. భూమి ఇచ్చిన దాతల కుటుంబాల్లో ఎదురుచూపులే మిగిలాయి. కొందరు ఉన్న కొద్దిపాటి భూమిని పోగొట్టుకోవడం.. తమ గోడు మంత్రులు, అధికారులకు వినిపించినా పట్టించుకోకపోవడంతో వచ్చే నెల నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు కార్యాచరణ రూపొందించారు.  

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 17 మండలాల్లో మెరుగైన విద్యుత్‌ను అందించేం దుకు 2013లో విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో సబ్‌స్టేషన్ల నిర్మాణానికి పూనుకున్నారు. అందుకు అవసరమైన స్థలాన్ని స్థానిక రైతుల నుంచి సేకరించారు. సబ్‌స్టేషన్‌ స్థాయి, వీలునుబట్టి అరెకరం, ఎకరం భూమిని తీసుకున్నారు. ఈ క్రమంలో భూమి ఇచ్చిన రైతు కుటుంబాల్లో అర్హతనుబట్టి ఉద్యోగం ఇస్తామని విద్యుత్‌ శాఖ అధికారులు హామీ ఇచ్చారు. ప్రతి సబ్‌స్టేషన్‌కు ఆపరేటర్, వాచ్‌మన్‌ను నియమిస్తామని చెప్పడంతో రైతులు సంతోషంగా తమ భూములిచ్చారు. సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపట్టారు.. ఐదేళ్లు పూర్తయింది.. ఉద్యోగాలు మాత్రం ఒక్కరికీ కూడా ఇవ్వలేదు. ఇటీవల విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని కలిసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది.  

సబ్‌స్టేషన్‌కు తాళాలు 
విద్యుత్‌ శాఖ అధికారులు ఇచ్చిన హామీ అమలు చేయకపోవడంతో సదరు రైతు కుటుంబాలు సబ్‌స్టేషన్ల ఎదుట ఆందోళనకు దిగుతున్నాయి. పలుచోట్ల సబ్‌స్టేషన్లకు తాళాలు వేసి.. నిరసన తెలియజేస్తున్నారు. అనేక మార్లు సంబంధిత అధికారులను భూ నిర్వాసితులు కలిసినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 17 గ్రామాల్లో దాదాపు ఇదే పరిస్థితి ఉంది. కూసుమంచి మండలం పోచారం గ్రామానికి చెందిన పి.వంశీ కుటుంబ సభ్యులు సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి ఎకరం స్థలం ఇచ్చారు. ప్రస్తుతం ఆ భూమి రూ.13లక్షల విలువ చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగం రాకపోవడంతో చెరువుమాధారం సబ్‌స్టేషన్‌ వద్ద రైతు కుటుంబం పలుమార్లు తాళాలు వేసి.. నిరసనకు దిగింది. ఇక అధికారులు తమ గోడు పట్టించుకోవడం లేదని, దీంతో వచ్చే నెల నుంచి ప్రత్యక్ష ఆందోళనలు చేస్తామని బాధిత రైతు కుటుంబాలు ప్రకటించాయి.
 

>
మరిన్ని వార్తలు