సాగు ఖర్చు తగ్గితేనే రైతుకు రాబడి

8 Oct, 2018 00:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే రైతులు ఎక్కువ పండించడం కాదని, సాగు ఖర్చులు తగ్గించుకునే పద్ధతులు అనుసరించాలని, అప్పుడు లాభాలు వస్తాయని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. రైతులు ఆ దిశగా దృష్టి పెట్టాలని సూచించారు. రైతు నేస్తం పురస్కారాల సందర్భంగా ఆదివారం స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, బీజేపీ నేత కిషన్‌రెడ్డి, ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పిటల్‌ చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి, రైతునేస్తం ఎడిటర్‌ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పీహెచ్‌డీలు, ఇతర ఉన్నత చదువులు చదివిన విద్యావంతులు వ్యవసాయంవైపు రావాలని కోరారు. 2022 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో ప్రధాని మోదీ ప్రణాళికలు రచించారని చెప్పారు.వాజ్‌పేయి ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా అనేక ముఖ్యమైన శాఖలు ఇచ్చేందుకు ఆయన తన అభిప్రాయం కోరారని, తాను పెద్దగా స్పందించక పోవడంతో అద్వానీకి ఆ విషయం చెప్పారనీ, అప్పుడు అద్వానీ తనను అడిగితే వ్యవసాయమంటేనే ఇష్టమన్నానని, అది వేరే వారికి ఇవ్వడంతో గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చారని తెలిపారు. వ్యవసాయ పరిశోధన ఫలితాలు నేరుగా ప్రజలకు చేరాలని అన్నారు.  

విద్య, వైద్యం, వ్యవసాయంపై దృష్టిసారించాలి...
విద్య, వైద్యం, వ్యవసాయరంగాలపై ప్రభుత్వాలు దృష్టిసారించాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. రోగం వచ్చాక చికిత్స చేసే కంటే రోగం రాకుండా ఏంచేయాలో వైద్యులు ప్రజలను చైతన్యం చేయాలన్నారు. ప్రస్తుతం గాలి, నీరు, ఆకాశం, ఆలోచనలు కలుషితం అయ్యాయన్నారు. ప్రస్తుత జీవనశైలితో కష్టం, శ్రమ తగ్గిందన్నారు. జబ్బు వస్తే వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారిందన్నారు.

అందుకే ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని కేంద్రం తీసుకొచ్చిందన్నారు. పాశ్చాత్య ఆహారపు అలవాట్లు మంచిది కాదన్నారు. నాటుకోడి పులుసు, నెల్లూరు చేపల పులుసు, హైదరాబాద్‌ ధమ్‌ బిర్యానీ, గుంటూరు గోంగూర పచ్చడి ఇలా సంప్రదాయ వంటకాలే మన ఆరోగ్యానికి మేలు చేస్తాయన్నారు. బీజేపీ నేత కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన రైతులకు ఎంతో ఉపయోగకరమన్నారు. కనీస మద్దతు ధర పెంచడంతో రైతులు చాలా సంతోషంగా ఉన్నారన్నారు.  

రైతు నేస్తం పురస్కారాలు...  
రైతు నేస్తం పత్రిక ఆధ్వర్యంలో ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వర్గీయ ఐ.వి.సుబ్బారావు పేరిట పురస్కారాలను పలువురు ప్రముఖులకు అందజేశారు. జర్నలిజంలో వ్యవసాయ రంగంలో చేస్తున్న కృషికిగాను ‘సాక్షి‘ఎడిటర్‌ వి.మురళికి ప్రకటించారు. అలాగే రైతునేస్తం జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ వి.ప్రవీణ్‌రావుకు ఉప రాష్ట్రపతి అందజేశారు.

కృషిరత్న అవార్డును డాక్టర్‌ ఖాదర్‌వలికి అందజేశారు. అలాగే రైతుల విభాగంలో వి.రజిత, నామన రోశయ్య, బోగోలు రాజేశ్, కొప్పుల శ్రీలక్ష్మి, క్రాంతి కిరణ్, గూడూరు వెంకట శివరామప్రసాద్, హరిబాబు, విశ్వేశ్వర్‌రెడ్డి, అయ్యప్పనాయుడు, యల్లా బాలస్వామి, నల్లపాటి రామకృష్ణ, కర్రమురళీధర్, హనుమంతరావునాయుడు, డి.నరేష్, రమణారెడ్డి అందుకున్నారు.

శాస్త్రవేత్తల విభాగంలో శ్యాంసుందర్‌రెడ్డి, సి.మధుమతి, ఎ.నారాయణరావు, కృష్ణారావు, శరత్‌చంద్ర, హరిబాబు, త్రివేణి, కోటిలింగారెడ్డి, ఈడ్పుగంటి శ్రీలత అందుకున్నారు. విస్తరణ విభాగంలో ధనలక్ష్మి, రవీంద్రబాబు, శివరాం, రాజాకృష్ణారెడ్డి, పెంటయ్య, ఆంజనేయులు, ములగేటి శివరాం, రవిచంద్రకుమార్, చంద్రశేఖర్‌రావు, కొండల్‌రెడ్డి, రేగూరి సింధూజ అందుకున్నారు. జర్నలిజం విభాగంలో సుమనస్పతరెడ్డి, సునీల్‌కుమార్, వీరరాఘవరెడ్డి, శరత్‌బాబు, అహోబలరావు, సుధాకర్‌రెడ్డి, రమేశ్‌ అందుకున్నారు.

మరిన్ని వార్తలు