నష్టం అపారం

10 May, 2014 23:25 IST|Sakshi

 సాక్షి, రంగారెడ్డి జిల్లా : అకాల వర్షాలు అన్నదాతలను అతలాకుతలం చేశాయి. గత నెల చివరి వారంలో కురిసిన అకాల వర్షాలతో భారీగా పంటలు దెబ్బతిన్నాయి. తాజాగా అల్పపీడన ప్రభావంతో గత ఐదురోజులుగా జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలతో 2,020 హెక్టార్లలో పంటలు నీటి పాలయ్యాయి. ఇందులో ఐదు మండలాల్లో 784 హెక్టార్లలో వరి పంట పూర్తిగా ధ్వంసమైంది. అదే విధంగా 9 మండలాల్లో 1,236 హెక్టార్లలో ఉద్యాన పంటలు పాడై రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ప్రాథమిక అంచనాలతో కూడిన నివేదిక తయారు చేసింది. ఈ వివరాలను శనివారం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. అయితే తుది నివేదికలు తయారయ్యేనాటికి నష్టం అంచనాలు మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

 50శాతం దాటితేనే లెక్క..
 అకాల వర్షాల ధాటికి పెద్దఎత్తున పంట నష్టం జరిగినప్పటికీ అధికారులు మాత్రం నిబంధనలకు లోబడే వివరాలు సేకరిస్తున్నారు. రైతు సాగు చేసిన విస్తీర్ణంలో కనిష్టంగా 50శాతం విస్తీర్ణంలో పంట పాడైతేనే నష్టం జరిగినట్లు లెక్క చూపుతున్నారు. 50శాతం కంటే ఏ మాత్రం తక్కువ నష్టం జరిగినా వాటిని జాబితాలోకి తీసుకోవడం లేదు. సర్కారు నిబంధనలతో రైతులందరికీ నష్టపరిహారం హుళక్కేనని తెలుస్తోంది. అధికారులు గుర్తించిన వివరాల ప్రకారం ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, దోమ, కందుకూరు మండలాల్లో 784 హెక్టార్లలో వరి పంట దెబ్బతింది.

అదే విధంగా షాబాద్, కందుకూరు, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల, శామీర్ పేట్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, శంకర్‌పల్లి మండలాల్లో 1,236 హెక్టార్లలో కూరగాయలు, పండ్ల తోటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. అయితే ప్రభుత్వం పంటలవారీగా నష్టం విలువను ప్రకటించకపోవడంతో కేవలం నష్టం విస్తీర్ణాన్ని గుర్తించినట్లు ఆయా శాఖల అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు