రైతుకు వరం.. బీమా

24 Mar, 2019 11:28 IST|Sakshi
చిరుమర్తిలో రైతు బీమా పత్రాలను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు(ఫైల్‌)

10 రోజుల్లోపు నామినీ ఖాతాలో నగదు జమ

మాడ్గులపల్లి మండలంలో  21 కుటుంబాలకు బీమా చెల్లింపు

సాక్షి,మాడుగులపల్లి : వ్యవసాయమే జీవనాధారమైన రైతులకుటుంబాలకు అండగా నిలువాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం వారికి వరంలా మారింది. రైతులు చనిపోయిన తరువాత వారి కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో రూ.5లక్షల బీమా డబ్బును అందజేస్తుంది. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరానికి రూ.638 కోట్ల రూపాయలను రైతుల పేరుమీద ఎల్‌ఐసి సంస్థలో జమ చేస్తుంది. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అమలుచేస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రైతులు ఏవిధంగా చనిపోయినా వారి కుటుంబానికి ఆసరాగా నిలవడానికి తెలంగాణ ప్రభుత్వం రైతు బీమా కలిపిస్తుంది. బీమా సంస్థకు ఒక్కోరైతు పేర 2271 రూపాయల చొప్పున సంవత్సరానికి ప్రీమియం చెల్లించడంతో రైతులు ఏకారణం చేతనైనా మరణిస్తే రూ. 5లక్షలు నగదు 10రోజుల్లో నామిని ఖాతాలో జమవుతున్నాయి. 2018 ఆగస్టు14 న ప్రవేశ పెట్టిన ఈ పథకం 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల అందరికీ వర్తిస్తుంది. 

మృతి చెందిన వెంటనే వివరాల సేకరణ 
రైతు మృతి చెందిన వెంటనే సంబంధిత పరిధిలోని వ్యవసాయ అధికారులు రైతు వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు పంపుతున్నారు. మొదట వ్యవసాయ విస్తరణ అ«ధికారి సదరు రైతు మృతి చెందిన విషయాన్ని వ్యవసాయ అధికారికి అందజేస్తే రైతు బ్యాంకు ఖాతా నంబర్, నామిని వివరాలను రైతు బీమా యాప్‌లో అప్‌ లోడ్‌ చేస్తారు. మండల వ్యవసాయ అధికారి వెబ్‌సైట్‌ ద్వారా పూర్తి వివరాలు జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయానికి వెళ్తాయి.

వివరాలు సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకొని నేరుగా మరణించిన రైతుకు సంబంధిచిన బీమా ఫైల్‌ను వ్యవసాయ శాఖ ఉన్నత అధికారులకు చేరవేస్తారు. అక్కడ నుంచి ఎల్‌ఐసీ కార్యాలయానికి రైతు వివరాలు వెళ్తాయి. ఈ కార్యక్రమం రైతు చనిపోయిన ఒకటి రెండు రోజులలోనే పూర్తవుతుంది. అనంతరం పదిరోజులలోపే నేరుగా నామిని ఖాతాలో డుబ్బలు జమవుతున్నాయి. లబ్ధి పొందిన కుటుం బాలు సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని పేర్కొంటున్నాయి.

నామినీ ఖాతాలో నగదు జమ..
మండలంలో సుమారు 5,530 మంది రైతులు రైతు బీమాకు అర్హులు అవుతున్నారని వ్యవసాయ అధికారులు గుర్తించారు.మండలంలో 21 మంది రైతులు మృతి చెందినట్టు వ్యవసాయ అధికారులు గుర్తించి వారి నామినీ ఖాతాలకు రూ.1.05 కోటి ఐదు లక్షలను జమచేశారు. 
     
    

మరిన్ని వార్తలు