రైతు ఆదాయం రెండున్నర రెట్లు

9 Dec, 2018 02:05 IST|Sakshi

తెలంగాణలో వచ్చే మూడేళ్లలో రూ.2 లక్షలు దాటడం ఖాయం

2015–16లో రూ.86,291.. దాదాపు రెండున్నర రెట్లు పెరుగుదల

వ్యవసాయాదాయంలో గణనీయమైన వృద్ధి: ఎస్‌ఎల్‌బీసీ ప్రకటన

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు సంక్షేమ పథకాలే కారణమని వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతు ఆదాయం గణనీయంగా పెరుగుతోందని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) పేర్కొంది. వచ్చే మూడేళ్లలో అన్నదాత ఆదాయం దాదాపు రెండున్నర రెట్లు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఎస్‌ఎల్‌బీసీ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు చేయాలన్న కేంద్ర ప్రభుత్వం లక్ష్యాలకు అనుగుణంగా.. రాష్ట్రంలో వడివడిగా అడుగులు పడుతున్నాయని వెల్లడించింది. జాతీయ సగటు కంటే రాష్ట్రంలో 2022 నాటికి రైతు ఆదాయం అధికంగా ఉంటుందని తెలిపింది. కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ రైతు సంక్షేమ పథకాల కారణంగానే ఇది సాధ్యం కానుందని వెల్లడించింది. ఇందులో నాబార్డు పాత్ర కూడా కీలకమేనని పేర్కొంది. 

తలసరి రూ.2.01 లక్షలు 
2015–16లో ప్రస్తుత ధరల ప్రకారం రైతుల సరాసరి ఆదాయం రూ.86,291. అందులో వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం రూ.63,492, వ్యవసాయేతర ఆదాయం రూ. 22,799. అదే జాతీయ స్థాయిలో అన్నదాత సగటు ఆదాయం రూ.96,703. అందులో వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం రూ. 58,246 కాగా.. వ్యవసాయేతర ఆదాయం రూ. 38,457. జాతీయస్థాయిలో రైతులకు వ్యవసాయం ద్వారా ఆదాయం తక్కువగా ఉండగా, రాష్ట్రంలో మాత్రం ఇది ఎక్కువగా ఉంది. కానీ వ్యవసాయేతర రంగాల ద్వారా వచ్చే ఆదాయం విషయంలో మాత్రం తెలంగాణ రైతులకు తక్కువ మొత్తం లభిస్తోంది. 2022–23 నాటికి ప్రస్తుత ధరల ప్రకారం ఉన్న ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశముందని ఎస్‌ఎల్‌బీసీ నివేదిక పేర్కొంది. 2022–23 నాటికి తెలంగాణలో రైతు ఆదాయం రూ.2,01,431 ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అదే జాతీయస్థాయిలో రైతు ఆదాయం రూ.2,19,724 ఉండనుంది. రాష్ట్రంలో రైతు పొందే ఆదాయంలో వ్యవసాయం ద్వారా రూ.1,56,522, వ్యవసాయేతర రంగాల ద్వారా రూ.44,909 పొందే అవకాశముందని ఎస్‌ఎల్‌బీసీ వెల్లడించింది. అదే జాతీయస్థాయిలో వ్యవసాయ ఆదాయం రూ.1,52,031  వ్యవసాయేతర ఆదాయం రూ. 67,693 ఉంటుందని తెలిపింది.

పెరుగుదలకు కారణమైన అంశాలు
2014–15 నుంచి తెలంగాణలో వివిధ అంశాలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించడం ద్వారానే రైతు ఆదాయం పెరుగుతుందని అంచనా వేసింది. పంటల ఉత్పాదకత ద్వారా 13.40% ఆదాయ వృద్ధి నమోదైంది. పశుసంవర్థక రంగాల ద్వారా 15.10% ఆదాయం సమకూరింది. వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వారా 16.90%, పంటల మార్పిడి ద్వారా 4.60%, పంటలకు సరైన ధరలు 8.70%, ఇతర అంశాల ద్వారా 16.40% ఆదాయం సమకూరిందని తెలిపింది. రానున్న రోజుల్లో రైతుబంధు రైతు ఆదాయం పెరుగుదలలో కీలకం కానుందని వ్యవసాయశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. రైతుబంధు ద్వారా అన్నదాతలకు పెట్టుబడి ఖర్చులు సమకూరుతున్నాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు తాము చేపట్టే పలు కార్యక్రమాలు కూడా రైతు ఆదాయం పెరుగుదలకు ప్రయోజనకారిగా ఉంటాయని నాబార్డు చెబుతోంది. రైతుల ఉత్పత్తి సంస్థలు (ఎఫ్‌పీవో), ఏరియా అభివృద్ధి పథకాలు, గిరిజనాభివృద్ధి కార్యక్రమాలు, సూక్ష్మస్థాయి అభివృద్ధి కార్యక్రమాలు, జాయింట్‌ లయబిలిటీ గ్రూప్స్‌ (జేఎల్‌జీ) ద్వారా ఆర్థిక సాయం వంటివి కీలకమైనవని నాబార్డు చెబుతోంది.

మరిన్ని వార్తలు