ఇలా సాగుదాం..  

11 May, 2019 13:13 IST|Sakshi

ఖమ్మంవ్యవసాయం: జిల్లా వ్యవసాయ శాఖ ఖరీఫ్‌ సీజన్‌కు ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ సూచనలు, ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న వనరుల ఆధారంగా పంటల సాధారణ సాగు విస్తీర్ణాన్ని ప్రణాళిక కమిటీ గుర్తించింది. జిల్లాలోని నేలలు, వాతావరణం, నీటి ఆధారం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని.. వాటికి అనుగుణంగా సాగు చేయాల్సిన పంటలను గుర్తించారు. రానున్న ఖరీఫ్‌లో రైతులు వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జలు, కందులు, పెసలు, మినుము, వేరుశనగ, నువ్వులు, పత్తి పంటలు సాగు చేయవచ్చని గుర్తించారు. జిల్లాలోని 21 మండలాల్లో ఆయా పంటల సాగుకు 2,30,498 హెక్టార్లు అనువుగా ఉన్నట్లు వ్యవసాయ శాఖ గుర్తించింది.

అయితే గత ఏడాది ప్రణాళికతో పోలిస్తే సాధారణ సాగు విస్తీర్ణం ఈ ఏడాది ప్రణాళికలో తగ్గింది. గత ఏడాది సాధారణ సాగు విస్తీర్ణం 2,32,707 హెక్టార్లు కాగా.. అంతకుమించి 2,53,158 హెక్టార్లలో పంటలు సాగు చేశారు. గత ఏడాది వరి, మిర్చి పంటల సాగు విస్తీర్ణంపెరిగింది. గత ఏడాది వరి సాధారణ సాగు విస్తీర్ణం 60,547 హెక్టార్లు కాగా.. 82,437 హెక్టార్లలో సాగు చేశారు. ఈ ఏడాది మాత్రం వరి సాధారణ సాగు విస్తీర్ణం ప్రణాళికలో కొంచెం తక్కువగా చూపారు. ఈ ఏడాది వరి 59,361 హెక్టార్లలో సాగుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అదే విధంగా పప్పు దినుసులు పెసర, కంది, మినుము, వేరుశనగ పంటల సాగు విస్తీర్ణాన్ని కూడా పెంచే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించారు.

43,862 క్వింటాళ్ల విత్తనాలు అవసరం 
వచ్చే ఖరీఫ్‌ కాలానికి సాగు చేసే వివిధ రకాల పంట లకు సంబంధించిన విత్తన ప్రణాళికను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. 43,862 క్వింటాళ్ల విత్తనాలు అవసరం ఉంటాయని వ్యవసాయ శాఖ ప్రణాళికలో పొం దుపరిచింది. వీటిలో దాదాపు 22,189 క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరం ఉంటాయని నిర్దేశించారు. టీ సీడ్స్‌ కార్పొరేషన్‌ నుంచి విత్తనాలను అందుబాటులో ఉంచుకునే విధంగా ప్రణాళికలు రూపొందించారు. అయితే ఇప్పటికే టీ సీడ్స్‌ సంస్థ 15వేల క్వింటాళ్ల వరి విత్తనాలను అందుబాటులో ఉంచింది. పెసర 2,910, కంది 50 క్వింటాళ్లను అందుబాటులో ఉంచింది. 


పచ్చిరొట్టకూ.. 
జీలుగు, పిల్లి పెసర, జనుము పంటలను సాగు చేసి.. సాగు భూమిని సారవంతం చేయాలని నిర్ణయించారు. జీలుగు 12,500 క్వింటాళ్లు, పిల్లి పెసర 6 వేల క్వింటాళ్లు, 635 క్వింటాళ్ల జనుము విత్తనాలను ఇప్పటికే టీ సీడ్స్‌ సంస్థ అందుబాటులో ఉంచింది.  

రాష్ట్ర వ్యవసాయ శాఖ సూచనల మేరకే..
రాష్ట్ర వ్యవసాయ శాఖ సూచనల మేరకు వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ ప్రణాళికను రూపొందించాం. అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే విత్తనాలను టీ సీడ్స్‌ అందుబాటులో ఉంచే విధంగా చర్యలు చేపట్టింది. ఎరువుల కొరత లేకుండా ముందస్తుగానే అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నాం.  – ఏ.ఝాన్సీలక్ష్మీకుమారి జిల్లా వ్యవసాయాధికారి

మరిన్ని వార్తలు