వెంటాడిన వాన

10 May, 2014 03:41 IST|Sakshi

 నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్:  రెండు మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు రైతన్నను ఆగం చేస్తున్నాయి. చేతికొచ్చిన పంట అమ్ముకునే వేళ అకాల వర్షాలు కురిసి ధాన్యం తడిసిపోవడంతో రైతన్న లబోదిబోమంటున్నాడు. జిల్లాలో గురువారం రాత్రి, శుక్రవారం కురిసిన అకాల వర్షం రైతులను నష్టాలకు గురిచేశాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు విక్రయానికి వచ్చిన ధాన్యం తడిసిపోయింది. అలాగే కోతకు వచ్చిన వరి పంట నేలకొరగగా వడ్లు నేలరాలాయి.

కోతకోసిన వరి కుప్పలు పంటపొలాల్లోనే తడిచి ముద్దయ్యాయి. ఆర్మూరు ప్రాంతంలో కల్లాలలో ఉడికించి ఆరబెట్టిన పసుపు వర్షంలో తడిసి పోవడంతో రంగు మారుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సజ్జ పంట కోత అనంతరం నూర్పిడి చేసేందుకు ఆరబెట్టగా వర్షంలో తడిసిపోయింది. చాలా ప్రాంతాల్లో మామిడికాయ లు నేలరాలిపోయాయి.

 విక్రయానికి తెచ్చి
 జిల్లాలో సుమారు 10 లక్షల ఎకరాలలో రైతులు వరిని పండించారు. కోతల అనంతరం ధాన్యాన్ని కొనుగో లు కేంద్రాలకు తరలించారు. మరికొన్ని చోట్ల వరికోతలు సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో అకాల వర్షం అన్నదాతలను కష్టాలకు గురిచేసింది. జిల్లాలో 289 ధాన్యం కేంద్రాలలో కొనుగోళ్లు జరుగుతున్నా యి. ఈ కేంద్రాలలో సుమారు ఎనిమిది వేల బస్తాలు వరకు ధాన్యం నీటిపాలైనట్లు అధికారులు తెలిపారు.  పలుచోట్ల గన్నీ బ్యాగుల కొరత, బీట్లు వేయడంలో ఆలస్యంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో మార్కెట్ యార్డులలో విక్రయానికి ఉంచిన పంట అకాల వర్షాలకు తడిసి ముద్దయ్యింది.  

 మార్కెట్‌యార్డుల్లో తడిసిన ధాన్యం
 జిల్లాలో అన్ని మార్కెట్‌యార్డ్‌ల్లో వరిధాన్యం తడిసి ముద్దయ్యింది. వారం రోజులుగా రైతులు ఎక్కువ మొత్తంలో ధాన్యాన్ని విక్రయానికి యార్డులకు తెస్తున్నారు. అకాల వర్షానికి ఆ ధాన్యం నీటిపాలైంది. ఒక్క నిజామాబాద్ మార్కెట్ యార్డులోనే రైతులకు చెంది న 600 బస్తాలు, వ్యాపారులకు సంబంధించి ఆరు వే ల బస్తాల ధాన్యం తడిసిపోయింది. ధాన్యాన్ని దాచేం దుకు సౌకర్యాలు లేకపోవడంతో రైతులు విలవిలలాడుతున్నారు. కనీసం కప్పేందుకు తాటిపత్రులు లేక రైతుల పడే పాట్లు అంతా ఇంత కాదు. తెలంగాణ లోనే అతి పెద్ద వ్యవసాయ మార్కెట్  ఉన్న ఇందూరు లో కనీస సౌకర్యాలు లేకపోవడంపై రైతులు వాపోతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కొనుగోలు చేయాలని కోరుతున్నారు.

 మోర్తాడ్‌లో అధిక వర్షం
 కలెక్టరేట్ : జిల్లాలో బుధ, గురు, శుక్రవారాలలో కురిసిన అకాలం వర్షం వేలాది ఎకరాలలో పంటలను నీటి పాలు చేసింది. గురువారం జిల్లాలో 15.02 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మోర్తాడ్ మండలంలో 65.0 మి.మీ, మద్నూరులో 52.2 మి.మీ వర్షపాతం నమోదైంది. కమ్మర్‌పల్లి, భీంగల్, మాక్లూర్ నిజామాబాద్‌లో 30 మి.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. భిక్కనూరు, దోమకొండ మండలాలలో అసలు వర్షమే కురియలేదు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా