ఇక.. చీటీ ఉంటేనే మందులు!

21 Feb, 2018 15:22 IST|Sakshi
తాండూరులో క్రిమిసంహారక మందుల దుకాణం

వ్యవసాయ అధికారులు ప్రిస్క్రిప్షన్‌ ఇస్తేనే ఎరువులు

అధిక మోతాదు వినియోగంతో నష్టాల్లో రైతులు

కొత్త విధానం అమలుకు ప్రభుత్వం చర్యలు

ఇక అగ్రి వైద్యులుగా వ్యవసాయాధికారులు

జిల్లాలో 1.74 లక్షల హెక్టార్లలో పంటల సాగు

సాక్షి, తాండూరు :  ఇక.. ఇష్టారాజ్యంగా పంటలపై మందుల వినియోగానికి చెక్‌ పడనుంది. వ్యవసాయాధికారులు అగ్రి వైద్యులుగా మారనున్నారు. ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్‌ దుకాణాలు అగ్రి మెడికల్‌ షాపులుగా మారనున్నాయి. రైతులు పంటలకు అధిక మోతాదు మందులు వినియోగించి నష్టపోతున్నారని గుర్తించిన ప్రభుత్వం నూతన విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. దీంతో పురుగులమందు దుకాణాలు అగ్రి మెడికల్‌ దుకాణాలుగా మారనున్నాయి. వ్యవసాయాధికారులు చీటీ ఇస్తేనే ఇకపై మందులు ఇచ్చే పద్ధతి అమలులోకి రానుంది. జిల్లాలో 18 మండలాలు, 501 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మొత్తం 7లక్షల ఎకరాలు సాగుకు అమోదయోగ్యమైన భూములు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో 1.74లక్షల హెక్టార్లలో కంది, మినుము, వేరుశనగ, శనగ, మొక్కజొన్న, పత్తి తదితర పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఏటా పురుగుమందులు వినియోగం పెరిగిపోతుంది. ఇప్పటివరకు రైతులు పురుగుమందులను దుకాణదారుల సూచన మేరకు వినియోగించేవారు. ఈక్రమంలో ఒక్కోసారి అధికమొత్తంలో కూడా ఉపయోగిస్తూ తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారు. దీనిని గుర్తించిన సర్కారు కొత్త పద్ధతిని అమలులోకి తీసుకురానుంది.   

ఇకపై ప్రిస్క్రిప్షన్‌ ఇస్తేనే..
పంటల దిగుబడి అధికంగా రావాలనే ఉద్దేశంతో రైతులు పంటలకు రసాయన మందులను అధిక మోతాదుతో వినియోగించి తీవ్రంగా నష్టపోతున్నారు. పంటకు పురుగు ఆశించిందని నేరుగా మందుల దుకాణాదారులను అడిగి వారు ఇచ్చిన మేరకు పిచికారీ చేస్తుండేవారు. ఈనేపథ్యంలో రైతులకు దుకాణాదారులు నకిలీ మందులను సైతం అంటగట్టేవారు. తద్వారా వేల హెక్టార్లలో పంట నష్టం జరుగుతోంది. ఈనేపథ్యంలో తీవ్రనష్టాలకు గురై కొన్నిసందర్భాల్లో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలూ లేకపోలేదు. దీం తో ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చర్యల కు ఉపక్రమించింది. ఇకపై వ్యవసాయ అధికారులు ప్రిస్క్రిప్షన్‌ లేకుండా మందుల విక్రయా లు చేయకుండా ఫెర్టిలైజర్, పెస్టిసైడ్‌ దుకాణాదారులకు ఉత్తర్వులు జారీ చేయనుంది.  

వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నుంచి..   
జిల్లాలో ఉన్న రసాయనిక పురుగుమందు, ఎరువుల దుకాణాల్లో వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నుంచి విత్తనం విత్తే నాటి నుంచి పంట చేతికొచ్చే వరకు అవసరమైన మందులను వ్యవసాయాధికారులు సూచనల మేరకు దుకాణాదారులు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకోసం అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.  

ఏఈఓల కొరత..
జిల్లాలో 501 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. 99 వ్యవసాయ క్లస్టర్లుగా ఉండాలి. అయితే, ప్రస్తుతం జిల్లాలో 53 క్లస్టర్లు మాత్రమే కొనసాగుతున్నాయి. ఒక్కో క్లస్టర్‌లో 5వేల ఎకరాలకు ఒక ఏఈఓ అందుబాటులో ఉండాలి. కాగా, జిల్లాలో 44 మంది ఏఈఓలు విధులు నిర్వహిస్తున్నారు. ఇంకా 46 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వ్యవసాయాధికారులకు ఇప్పటికే తలకు మించిన భారం ఉండటంతో పని ఒత్తిడి తీవ్రమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందుల చీటీ రాసి ఇవ్వడం మంచిదే అయినా, ఈ పద్ధతి నిర్వహణలో ఇబ్బందులు తప్పేలా లేవని క్షేత్రస్థాయిలో అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

చీటీ రాసి ఇస్తేనే మందులు..
రైతులు పండిస్తున్న పంటలకు పిచికారీ చేసేందుకు వ్యవసాధికారులు చీటీ రాసి ఇవ్వాల ని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి. జిల్లాలో ఏఈఓల కొరత ఉంది. ప్రభుత్వం త్వరలో ఏఈఓలను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఏఈఓలు బీజీగా ఉన్నారు. అయినప్పటికీ ఈ విధానం అమలు చేసేలా చర్యలు తీసుకుంటాం. –గోపాల్, వ్యవసాయాధికారి,వికారాబాద్‌ జిల్లా
 

మరిన్ని వార్తలు