తీరనున్న యూరియా కష్టాలు

12 Sep, 2019 06:50 IST|Sakshi
జడ్చర్ల రేక్‌పాయింట్‌ను పరిశీలిస్తున్న మహబూబ్‌నగర్‌ డీఏఓ సుచరిత

జడ్చర్ల రేక్‌పాయింట్‌కు వ్యాగన్‌ రాక

ప్రస్తుతం వచ్చింది 1,649 మెట్రిక్‌ టన్నులు

సాక్షి, జడ్చర్ల టౌన్‌: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో రైతులు పడుతున్న యూరియా కష్టాలు ఇక తీరనున్నాయి. తాజాగా బుధవారం జడ్చర్ల రైల్వేస్టేషన్‌కు వ్యాగన్‌ ద్వారా స్పిక్‌ కంపెనీకి చెందిన 1,649 మెట్రిక్‌ టన్నుల యూరియా వచ్చింది. గురువారం మరో రెండు వ్యాగన్‌ల ద్వారా 3,800 మెట్రిక్‌ టన్నుల యూరియా రానుంది. జడ్చర్ల రేక్‌పాయింట్‌కు చేరుకున్న యూరియాను మహబూబ్‌నగర్‌ డీఏఓ సుచరిత, మార్క్‌ఫెడ్‌ ప్రతినిధి ప్రణీత్, రేక్‌పాయింట్‌ అధికారి, జడ్చర్ల ఏఓ రాంభూపాల్‌ పరిశీలించారు. వచ్చిన ఈ యూరియాను ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందించారు. 

ఆయా జిల్లాలకు పంపిణీ ఇలా
యూరియాను మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి జిల్లాలకు 500 మెట్రిక్‌ టన్నుల చొప్పున సరఫరా చేయాలని అధికారులు నిర్ణయించారు. గద్వాల, నాగర్‌కర్నూలు జిల్లాలకు 129 మెట్రిక్‌ టన్నుల చొప్పున యూరియాను పంపించనున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు కేటాయించిన యూరియాలో జడ్చర్ల మండలానికి 120 మెట్రిక్‌ టన్నుల యూరియాను సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కోరమండల్‌ యూరియా మొదటి విడతగా 800 మెట్రిక్‌ టన్నులు, రెండో విడతగా 3,000 మెట్రిక్‌ టన్నులు రానుందన్నారు.

ఉమ్మడి జిల్లాలో కొరత లేదు 
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో యూరియా కొరత లేదని డీఏఓ సుచరిత స్పష్టం చేశారు. బుధవారం జడ్చర్ల రేక్‌పాయింట్‌ పరిశీలించిన అనంతరం విలేకరులతో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం 1,649 మెట్రిక్‌ టన్నుల యూరియా వచ్చిందని, గురువారం 3,800 మెట్రిక్‌ టన్నులు రానుందన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అన్ని ప్రాంతాలకు కావాల్సిన విధంగా యూరియాను సరఫరా చేస్తున్నామన్నారు. వచ్చిన యూరియాలో 50 శాతం మార్క్‌ఫెడ్‌ ద్వారా సంఘాలకు ఇస్తామని, మిగతాది డీలర్లకు కేటాయిస్తామన్నారు. తద్వారా రైతులు రద్దీ లేకుండా సౌకర్యంగా యూరియా తీసుకువెళ్లగలుగుతారన్నారు.

గత జూన్‌లో వర్షాలు కురియకపోవడం వల్ల యూరియా డిమాండ్‌ లేదన్నారు. జూలై, ఆగస్టులో వర్షాలు కురియడంతో యూరియాకు డిమాండ్‌ పెరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌ సీజన్‌లో 1.17 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతున్నాయన్నారు. వీటికోసం 34 వేల మెట్రిక్‌టన్నుల యూరియా అవసరం ఉందని ప్రతిపాదనలు పంపామన్నారు. నెల వారీగా నివేదికలు ఇచ్చామని అందులో బుధవారం సాయంత్రం వరకు 22,649 మెట్రిక్‌ టన్నులు సరఫరా అయ్యిందన్నారు. జిల్లాలో మండలాల వారీగా ముందుజాగ్రత్తలు తీసుకుని యూరియా నిల్వలు ఉంచటం వల్ల సమస్య తలెత్తకుండా చూశామన్నారు. అవసరమైన ప్రాంతాలకు నిల్వ ఉన్నచోటనుంచి పంపిణీ చేశామని తెలిపారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా